రామగిరి, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని, తెలంగాణ రాష్ట్రంలోని 15.25 లక్షల ఉద్యోగుల, 206 సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. దశల వారి పోరాటంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించి, కలెక్టర్‌కు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. గురువారం టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో టీజీఈజేఏసీ తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యయుల, కార్మిక మరియు పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీజీఈజేఏసీ సెక్రటరీ సుంకరి భిక్షం గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మారం అంజిరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా విడివిడిగా ఉన్న సంఘాలు తమ సమస్యల సాధన కోసం ఏకమై జేఏసీగా ఏర్పడినవి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలన్నారు. ఈ నాటికి ఉద్యోగ విరమణ చేసిన 206 ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తమ బెనిఫిట్స్ అందక మరణించారని ఇది ఉద్యోగులకు ఎంతో మనోవేదన కలుగజేస్తుందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రధానమైన నాలుగు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.
1. తెలంగాణ రాష్ట్ర 2వ పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించి జూన్ 2 లోపు అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం 2వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దాదాపుగా 30 నెలలు పూర్తి అయిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్మెంట్తో తెలంగాణలో 2వ పి.ఆర్.సి ని అమలు చేయాలని, పి.ఆర్.సి కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించొద్దని పిఆర్చి నివేదికను వెంటనే తెప్పించి జూన్ 2 లోపు అమలు చేయాలి.
2. పెండింగ్ బిల్లుల విడుదల
ప్రభుత్వం పెండింగ్ బిల్లులు నెలకు రూ.700 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. కావున ఏక మొత్తంగా పెండింగ్ లో ఉన్న రూ.13,000 కోట్లను వెంటనే ఏక మొత్తంగా విడుదల చేయాలి.
3. ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య కార్డుల మంజూరు
ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై మంత్రివర్గ ఉప కమిటీ ఇప్పటికీ నిర్ణయం తీసుకొన్నప్పటికి దీన్నీ వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు TGEJAC తో జరిపిన సమావేశాలలో చెబుతున్నప్పటికీ అమలు కావడంలేదు. దీనివల్ల ఉద్యోగులు పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త EHS స్కీం విధి విధానాలను వెంటనే రూపొందించి, మే 1వ తేదీ నుండి ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలి.
4. రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ (CPS)ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీం (OPS) ను పునరుద్ధరణ చేయాలి. 01/09/2004 కంటి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ స్కీం (OPS) ను అమలు చేయాలి.
ఈ నాలుగు ప్రధాన డిమాండ్ లతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన, మిగిలిన దీర్ఘకలికంగా ఉన్న (64)అంశాలలో పెండింగ్ లో ఉన్న వాటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జె.శేఖర్ రెడ్డి, యాకుబ్ నాయక్, కాలం నారాయణరెడ్డి, నర్రా శేఖర్ రెడ్డి, నిమ్మనగోటి జనార్ధన్, మేకల జాన్ రెడ్డి, యడ్ల సైదులు, తరాల పరమేష్, ఎస్.ఆంజనేయులు, గేర నరసింహ, నలపరాజు వెంకన్న, సిహెచ్ లింగయ్య, కే.మనోజ్ ప్రదీప్, వంగూరు విజయ కృష్ణ, బి.సైదులు నాయక్, బి.రవి నాయక్, డిఐ రాజు, రణదీవే, వి.భాస్కర్, సత్యనారాయణ, మహమ్మద్ హనీఫ్, మురలయ్య, కె.సైదులు, పి.సైదులు, రవీందర్, భాను ప్రకాష్, ఎన్.సైదులు, మధు పాల్గొన్నారు.