యాదాద్రి భువనగిరి, మే 18 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన గంధమల్ల రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు కాంగ్రెస్ సర్కార్ మొండి చెయ్యి చూపిస్తోంది. భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించకుండానే జలాశయ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నది. రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు సిద్ధమైంది. ఓ వైపు పరిహారం చెల్లించకుండా.. మరోవైపు రైతుబంధు రాకుం డా..ఇంకోవైపు పనులకు శ్రీకారం చుడుతుండటంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు.
కాళేశ్వరంలో అంతర్భాగమే గంధమల్ల..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ప్రాజెక్టే గంధమల్ల. ఇది కాళేశ్వేరంలో అంతర్భాగం. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్‌కు చేరిన నీళ్లు అటు నుంచి పలు ప్యాకేజీలకు చేరుతుంది. ప్యాకేజీ -14లో భాగంగా కొండపోచమ్మ సాగర్‌కు, ప్యాకేజీ 15లో భాగంగా గంధమల్లకు చేరుతాయి. అయితే బీఆర్ఎస్ హయాంలోనే గంధమల్ల రిజర్వాయర్ ప్రతిపాదనలు వచ్చాయి. అయితే అప్పుడు కరెంట్ పోల్స్ ఉన్నాయనే కారణంతో రిజర్వాయర్‌ను కుదించారు.
ఆ తర్వాత 2018లో 4.28 టీఎంసీలకు తగ్గించగా, 2019 భూసేకరణకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అనంతరం వివిధ కారణాలతో 2022లో 1.41టీఎంసీలకు తగ్గించి.. ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇదే ప్రతిపాదనకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 575.55 కోట్లతో మంజూరీ ఇచ్చింది. ప్రాజెక్టు కోసం 2500 మంది రైతుల నుంచి సుమారు 1040 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో గంధమల్ల గ్రామంలో 760 ఎకరాలు, వీరారెడ్డి పల్లిలో 280 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటి వరకు 573 ఎకరాలకే అవార్డు పాసైంది. ఒక్కో ఎకరానికి రూ. 24.50లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు.

పరిహారం పత్తాలేదు..
2025 జూన్ 6న రేవంత్ రెడ్డి గంధమల్ల రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. అయితే రిజర్వాయర్‌లో భాగంగా మూడు కిలోమీటర్ల మేర బండ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం 112 ఎకరాల భూమి మునిగిపోనుంది. మిగ తా భూములు జలాశయంలో ముంపునకు గురవుతాయి. అయితే ప్రభుత్వం, అధికారులు తెలివిగా తొలుత బండ్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించారు. 112 ఎకరాల్లో కేవలం 89 ఎకరాలకు మాత్ర మే పరిహారం అందింది. అంతే కాకుండా కట్ట లోపల భూములు కోల్పోతున్న వారికి మొండిచెయ్యి చూపించారు.
అంతటితో ఆగకుండా బండ్ పనులకు శ్రీకారం చుట్టేందుకు కాంట్రాక్టర్ అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కట్ట ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడే కార్మికులు షెడ్లు వేసుకున్నారు. రేపోమాపో పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తున్నది. ఇటీవల పరిహారం విషయమై రైతులు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వద్దకు వెళ్లి తమ గోడు వెల్లబోసుకోగా, ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, ఇచ్చినప్పుడు తీసుకోవాలని బూతులు తిట్టారని రైతులు వాపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. బండ్ పనులు పూర్తి చేశాక.. రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన తమ పరిస్థితి ఏంటని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు.
నిర్వాసితులకు రైతు భరోసా బంద్..
రిజర్వాయర్ నిర్వాసితుల పరిస్థితి కక్కలేక..మింగలేక అన్నట్లుగా ఉంది. ముంపు పేరుతో ఉన్న భూములను గుంజుకొని నిషేధిత జాబితాలో పొందుపరిచిం ది. దీంతో సర్కారు నుంచి అటు పరిహారం రావడంలేదు. ఇటు రైతు భరోసా డబ్బులు జమ కావడంలేదు. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. మరోవైపు సర్కారు నిర్వాకంతో ఒక్క గుంట భూమి పోయి నా..సర్వే నంబర్ మొత్తం నిషేధిత జాబితాలో పొందుపరిచారని రైతులు చెబుతున్నారు. ఫలితంగా మిగతా భూములు సైతం నిషేధిత జాబితాలో చేరాయి. ఇదే విషయమై కలెక్టర్‌కు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.
పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలి
మా కుటుంబానికి ఉన్న ఐదు ఎకరాలు భూమే ఆధారం. ఇప్పటి వరకు దానిపైనే ఆధారపడి సాగు చేసుకొని జీవిస్తున్నాం. రిజర్వాయర్ నిర్మాణంతో ఉన్న భూమి మొత్తం కోల్పోతున్నాం. అధికారులు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. కానీ పనులు మాత్రం చేయాలని చూస్తున్నారు. కట్ట ప్రదేశంలో షెడ్లు వేశారు. అధికారులను అడిగితే పొంతలేని సమాధానాలు చెబుతున్నారు. పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలి.
-సిరిగిరి నరసయ్య, నిర్వాసితుడు, గంధమల్ల
కట్ట నిర్మించాక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు?
కొంతమందికి డబ్బులు ఇచ్చి.. మిగిలిన రైతులకు ఇవ్వకుండా అధికారులు పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. పరిహారం ఇస్తామని పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. వారి మాట నమ్మి రాజాపేట మండలంలో రెండు ఎకరాల భూమికి అడ్వాన్స్ ఇచ్చా. కానీ నేటికీ సర్కారు పరిహారం ఇవ్వకపోవడంతో ఇచ్చిన అడ్వాన్స్ పోయేలా ఉంది. ఇప్పుడే పరిహారం ఇవ్వకుంటే కట్ట నిర్మించాక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటరు..? చేతిలో చిల్లిగవ్వ పెట్టకుండా పనులు ఎలా మొదలు పెడతారు..? రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న మాకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి.
-రుద్ర పాండు, నిర్వాసితుడు, గంధమల్ల