కొండమల్లేపల్లి, డిసెంబర్ 19: గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలన పదేళ్లు సాగింది. ప్రతి చిన్న జీపీకి సొంత భవనం ఉండాలనే సంకల్పంతో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉపాధి నిధులతో నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం మారడం.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నూతన జీపీ భవనాల నిర్మాణంపై సీతకన్ను వేసింది. నిధులను పూర్తిగా నిలిపేంది. పనులు అర్ధాంతరంగా అగిపోవడంతో కొత్తగా ఏర్పడిన పంచాయతీలు కొన్ని అద్దె భవనాల్లో, మరికొన్ని శిథిల భవనాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన భవనాల నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతి అనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ పల్లెలు, గిరిజన తండాలు, గూడెలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 300 జనాభా కలిగిన తండాలను, గూడెలను నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. వెంటనే పంచాయతీలకు అధిక నిధులు కేటాయించడంతో పల్లెలు, గూడెలు అభివృద్ధిలో పరుగుల పెట్టాయి. ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండాలనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఉపాధి నిధులతో జీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అర్ధాంతరంగా వదిలేసింది. నిధుల విడుదలను పూర్తిగా నిలిపేసింది. ఫలితంగా శిథిల, కూలిపోయే భవనాలు, అద్దె గదుల్లో పాలన వ్యవస్థ కునారిల్లుతోంది.
కొండమల్లేపల్లి మండల పరిధిలో 2018-2023లో చింతచేట్టుతండా, గుర్రపుతండా, గాజీనగర్, దేవరోపనితండా, గౌరికుంటతండా, రమావత్తండా, గుడితండా, కోర్రతండా, కేశ్యతండాలలో ప్రతి పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేశారు. వీటిలో అనేక భవనాలు స్లాబ్ దశలోనే నిలిచిపోయాయి. పూర్తయిన కొన్ని భవనాలు ప్రారంభోత్సవానికి నోచుకోక నిరుపయోగంగా మారాయి. నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపంతోనే నిర్మాణాలు పెండింగ్లో పడ్డాయిని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కొండమల్లేపల్లి మండలంలోని గుర్రపుతండాలో నూతన జీపీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికలు రావడంతో నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. దీంతో ప్రస్తుతం అద్దె భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చింతచేట్టుతండా పంచాయతీ భవనానికి స్లాబ్ వేసి దాదాపు 50 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన 50 శాతం పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మూడేండ్లుగా నిర్మాణం నిలిచిపోయిందని స్థానికులు వాపోతున్నారు. మండలంలోని మరొకొన్ని గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణం మధ్యలోనే నిలచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో దేవరకొండ నియోజకవర్గంలోని అనే గ్రామాల్లో అద్దె భవనాలు, శిథిల భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అరకొర వసతులతో కార్యకలాపాలు సాగుతున్న పంచాయతీల్లో మహిళా సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారని పలువురు వాపోతున్నారు. గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారినా పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీల్లో భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.