కొండమల్లేపల్లి, మే 19 : గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పులు చెప్పుకుంటూ జనంలో ఆశలు రేపింది. కానీ 200 యూనిట్ల లిమిట్ ఆ ఆశలను నీరు గారుస్తోంది. లిమిట్ దాటితే భారీ బిల్లుతో గృహజ్యోతి లబ్ధిదారులకు షాక్ ఇస్తోంది. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి చివరికి బిల్లుల భారం మోపడం ఎందుకు ? అని లబ్ధిదారులు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవరకొండ డివిజన్ గిరిజన ప్రాంతం కావడంతో బీద, మధ్యతరగతి జనం దాదాపు 80 శాతం ఉన్నారు. జీరో బిల్లుపై ఆశలు పెట్టుకున్న వీరందరికీ షాక్ తగిలిందనే చెప్పాలి. 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ వర్తిస్తుండగా, ఆ తర్వాత పరిమితి దాటితే పూర్తి బిల్లు చెల్లించాల్సి వస్తోందని జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. ఈ కారణంగా మెజార్టీ కుటుంబాల విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటుతోంది. ఫలితంగా 200 యూనిట్లు దాటిన వారంతా గృహజ్యోతి పథకానికి అనర్హులవుతున్నారు. దేవరకొండ డివిజన్ పరిధిలో మార్చి నెలలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య 50,681 మంది. కాగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారు 49, 222 మంది. మిగతా 1459 మంది 200 యూనిట్ల కన్నా ఎక్కువగా విద్యుత్ వినియోగించడంతో అనర్హులయ్యారు. అలాగే ఏప్రిల్ 50750 మంది లబ్ధిదారులకు గాను 200 యూనిట్ల విద్యుత్ వాడింది 48,038 మంది. మిగతా 2,712 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగించారు. కాగా రెండు నెలల వ్యవధిలో 4,171 మంది గృహజ్యోతి పథకానికి అనర్హులయ్యారు. మే నెలలో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం బిల్లు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా అయితే ఎలా ? అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీపై లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి వస్తోంది. ప్రస్తుత లబ్ధిదారుల కరెంట్ వాడకాన్ని చూపుతూ వారి సంఖ్యను తగ్గిస్తున్నారు. ఈ పథకం కింద లబ్ధిపొందుతున్న వారికి జీరోకు బదులు వేలల్లో బిల్లులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. కొండమల్లేపల్లికి చెందిన ఓ వ్యక్తికి ఏప్రిల్ నెల బిల్లు రూ. 1,390 వచ్చింది. సదరు వ్యక్తి గృహజ్యోతి లబ్ధిదారుడు. కాగా ఏప్రిల్ 1నుంచి మే 2వరకు 31 రోజులకు 236 యూనిట్ల కరెంట్ వాడారు. దీంతో యూవరేజీగా నెలవారీ యూనిట్లు 229గా లెక్క వేసి అతనికి బిల్లు వేశారు. అంటే యావరేజ్ కంటే 7 యూనిట్లు అధికంగా విద్యుత్ వాడితే రూ.1.390 కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తాము 236 యూనిట్లు వాడితే 36 యూనిట్లకే డబ్బు తీసుకోవాలి. కానీ వాడిన మొత్తానికి బిల్లు ఎలా వసూలు చేస్తారని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో రెండు ఫ్యాన్లు, ఒక ఫ్రిజ్, టీవీ మాత్రమే ఉన్నాయి వేసవిలో కూలర్ వాడితే 200 యూనిట్లు దాటిపోతున్నది. దీంతో రూ. 1,500, నుంచి 2,000 వరకు బిల్లు వస్తోంది. ఇది తమకు భారంగా మారిందని మధ్యతరగతి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 200 యూనిట్లపై మాత్రమే చార్జీ వేయాలి. లేదా లిమిట్‌ను కనీసం 300 యూనిట్లకు పెంచాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకే జీరో బిల్లు వస్తుంది. ఒక్క యూనిట్ దాటినా మొత్తం బిల్లు కట్టాలి. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించి, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి. రాత్రి వేళల్లో అవసరం ఉన్నప్పుడు మాత్రమే బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఆన్ చేయాలి. సాధారణ వినియోగదారులు కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తమకు ఎంత లోడ్ అవసరముందో తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కువ లోడ్ వాడితే డెవలప్మెంట్ చార్జీలు పడతాయి.