రామగిరి, డిసెంబర్ 30 : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర 6వ మహాసభలు నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్‌లో సోమవారం విజయవంతంగా ముగిశాయి. చివరి రోజు సాగిన ప్రతినిధుల సభలో మహాసభ ఆహ్వాన సంఘం చైర్మన్, ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవితోపాటు పలువు నేతలు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు ప్రవేశపెట్టారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ -2020)ని రద్దు చేయాలని, అందరికీ ఆమోదయోగమైన శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.నో డిటెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ విద్యాహక్కు చట్టం 2009కి సవరణలు చేయడాన్ని ఖండించారు.
విదేశీ యూనివర్సిటీలను దేశంలో నియంత్రించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్, యూపీఎస్ విధానాలను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఎస్, యూపీఎస్ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని, ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ని సవరించాలని తెలిపారు. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జట్లో 15శాతం నిధులు కేటాయించాలని, మధ్యాహ్న భోజనం పథకం నాణ్యత కల్పించేలా రేట్లు పెంచాలని చెప్పారు. కేజీబీవీ, యూఆర్ఎస్, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లందరికీ మినిమం బేసిక్ పేను అందించాలని, హెల్త్‌కార్డుల ఇవ్వాలని తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.
రాములు, కోశాధికారి లక్ష్మారెడ్డి, పి.మాణిక్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, వెంకట్, నాగమని, నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బక్కా శ్రీనివాసాచారి, పెరుమాళ్ల వెంకటేశం, కోశాధికారి నర్రా శేఖర్‌రెడ్డి, నలపరాజు వెంకన్న, మాజీ అధ్యక్షుడు ఎడ్ల సైదులు తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా చావ రవి, ఎ.వెంకట్‌తోపాటు కార్యవర్గం ఎన్నిక చేయగా దానిలో నల్లగొండ జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. వీరిలో రాష్ట్ర కార్యదర్శులు నల్లగొండ జిల్లా నుంచి ఎం. రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, సూర్యాపేట జిల్లా నుంచి సీహెచ్. రాములు ఉన్నారుఏ. కుటుంబ సంక్షేమ నిధి చైర్మన్‌గా జిల్లా వాసి ఎం.రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారిగా ఎడ్ల సైదులుకు అవకాశం దక్కింది. నూతన కమిటీకి ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డితోపాటు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ 2025 డైరీ, కాలెండర్ను ఆవిష్కరించారు.