రామగిరి/మిర్యాలగూడ/సూర్యాపేట/చిలుకూరు, నవంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17, 18న నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష సజావుగా ముగిసింది. పేపర్-3 పరీక్ష సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగింది. నల్లగొండ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో 88 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 28,353 మందికి 15,257 (45 శాతం) మంది హాజరుకాగా 13,090 మంది గైర్హాజరయ్యారు. నల్లగొండ పట్టణంలో 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20,555 మంది అభ్యర్థులకు 12,357 మంది హాజరుకాగా 8,198మంది గైర్హాజరయ్యారు.
మిర్యాలగూడలో 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 7,798 మంది అభ్యర్థులకు 2,900 మంది హాజరుకాగా 4,898 మంది గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్, పరీక్ష నోడల్ అధికారి జె.శ్రీనివాస్‌తోపాటు ఆర్డీఓ అశోక్‌రెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, తాసీల్దార్ హరిబాబు, టీజీపీఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జేఎన్టీయూ ప్రత్యేక పరిశీలకుడు విజయ్‌భాస్కర్, పరీక్షల రీజినల్ కోఆడినేటర్స్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, పరీక్షల నియంత్రణాధికారి బి.నాగరాజుతోపాటు పలువురు అధికారులు పరీక్షలను తనిఖీ చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఎస్పీ శరత్‌చంద్రపవార్, ఏఎస్పీ రాములునాయక్ పర్యవేక్షణలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు కొనసాగించారు. దీంతో ఎక్కడ ఎలాంటి సంఘటనలు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష ముగిసిన తర్వాత పూర్తి మెటీరియల్‌ను ప్రత్యేక బందోబస్తు మధ్య ఎన్జీ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు.
సూర్యాపేట జిల్లాలో
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో గ్రూప్-3 ఎగ్జామ్ నిర్వహించారు. రెండో రోజు 50 పరీక్ష కేంద్రాల్లో 16,543 మంది అభ్యర్థులకుగానూ 9,232 (55.8) మంది హాజరుకాగా 7,311 మంది గైర్హాజరయ్యారు. పరీక్షకు సబంధించిన పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. జిల్లాలో పరీక్షలు సాఫీగా జరిగేలా పనిచేసిన అధికారులు, సిబ్బంది, పోలీస్ అధికారులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అభినందించారు. అందరి సహకారంతోనే ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.