నల్లగొండ, నవంబర్ 6 : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లావాప్తంగా బుధవారం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీల్లో 3,483 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో భాగస్వాములయ్యారు. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు, 5 మున్సిపాలిటీల్లో 2,601 మంది ఎన్యుమరేటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,938 ఎన్యుమరేటర్లు విధుల్లో పాల్గొన్నారు. వారిని మండల స్దాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. తొలి రోజు అంతటా ఇండ్లను గుర్తించి స్టిక్కర్లు వేశారు. ఈ నెల 8వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 9 నుంచి గుర్తించిన ఇండ్లల్లో సర్వే చేస్తారు. ఇప్పటికే ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో సర్వే విషయంపై ఠాంఠాం వేయించిన అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇచ్చిన ఫామ్‌లోని 75కాలమ్స్‌లో వివరాలను నమోదు చేయనున్నది.
వలిగొండ మండల కేంద్రంలోని సాయినగర్‌లో ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సర్వే స్టిక్కరింగ్‌ను ప్రారంభించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్తోపాటు మునుగోడు మండలం గూడపూర్, చండూర్ మున్సిపాలిటీలో కలెక్టర్ ఇలా త్రిపాఠి సర్వేను తనిఖీ చేశారు. సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లాకేంద్రంలోని 16వ వార్డు వంద ఫీట్ల రోడ్డులో సర్వేను పరిశీలించారు. భువనగిరి మండలం వడాయిగూడెంలో అదనపు కలెక్టర్ గంగాధర్ సర్వే స్టిక్కరింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. తొలుత కుల గణన అన్న ప్రభుత్వం ఆ తర్వాత సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇంటి యజమానులు ఆధార్, రేషన్ కార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.