రామగిరి, మార్చి 15 : అన్ని రంగాల్లో మహిళ భాగస్వామ్యంతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ అల్వాల రవి అన్నారు. ఎంజీయూ ఇంటర్నల్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఓఎస్డీ కొప్పుల అంజిరెడ్డితో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. తరతరాలుగా మహిళలు సామాజిక కట్టుబాట్లకు, హింసకు దోపిడీకి బలవుతూ క్రమంగా అభివృద్ధి పథంలో సాగుతున్నప్పటికీ మరింత భాగస్వామ్యం పెరుగాలన్నారు.
ఓఎస్డీ కొప్పుల అంజిరెడ్డి మాట్లాడుతూ సామాజిక మార్పులో మహిళ విద్య కీలకమన్నారు. గ్రామ్య రిసోర్స్ సెంటర్ సంచాలకులు సుమలత మాట్లాడుతూ దేశంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష, హింస, దోపిడీని అరికట్టేందుకు అవగాహన, రక్షణ కోసం సఖి సెంటర్లు ఉద్భవించాయని తెలిపారు. ఇంటర్నల్ కమిటీ చైర్పర్సన్ బి. సరిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సఖి సెంటర్ ప్రతినిధులు సునీత, దివ్య, నాగమణి, ప్రిన్సిపాల్ మారం వెంకటరమణారెడ్డి, ప్రేమ్ సాగర్, హాస్టల్స్ డైరెక్టర్ దోమల రమేశ్, ప్లేస్మెంట్ సెల్ అధికారిణి ప్రశాంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.