నీలగిరి, ఆగస్టు 5 : పైసాకు పైసా.. రెట్టింపుతోపాటు అధికశాతం వడ్డీ.. ఆకర్షణీయమైన ఆఫర్లు.. ఇంట్లోనే ఉంటూ కోట్ల రూపాయలు సంపాదించండి అంటూ ముందుకు వచ్చిన ఓ యాప్ జిల్లా ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెట్టింది. కొద్దికొద్దిగా డబ్బులు చెల్లించి లాభాలు పొందండి అంటూ అమాయక ప్రజలను డాయ్(డాటా మీర్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ స్టీరింగ్) యాప్ దగా చేసింది.
నల్లగొండ పట్టణంలో సుమారు 370 మంది, జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది బాధితులు దీని ద్వారా నష్టపోయినట్లు తెలుస్తున్నది. ఒక్కొక్కరు ఈ యాప్‌లో రూ.30వేల నుంచి రూ .10లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. సుమారు రూ.30 కోట్లకుపైగా పెట్టుబడుల పేరుతో యాప్ జనాలను ఆకర్షించి డబ్బులు వచ్చాక మూసివేసింది. బాధితులు చేసేది లేక లబోదిబోమంటూ పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులతో రూ.5లక్షల వరకు సీజ్ చేసినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
డాయ్లో ప్రవేశం ఇలా…
ముందుగా మన వద్ద ఉన్న డబ్బులతో యాప్‌లో పెట్టుబడి పేరుతో రీచార్జి చేసుకోవాలి. అలా చెల్లించిన డబ్బులు థర్డ్ పార్టీ అమౌంట్‌కు జమ అవుతాయి. అక్కడ నుంచి యాప్‌లో సదరు వ్యక్తికి షేర్ల రూపంలో మనీ వస్తుంది. యాప్‌లో వివిధ రకాల షేర్లు ఉంటాయి. ఒక్కో షేర్ విలువ రూ. 300 నుంచి 10వేల వరకు ఉంటుంది. పెద్ద షేర్స్ తీసుకుంటే ఎక్కువ మొత్తంలో, తక్కువ షేర్స్ తీసుకుంటే తక్కువ లాభాలు వస్తాయి. నష్టం అనే పదం ఉండదు.
అందులో చేరాలంటే ప్రతి సభ్యుడు కచ్చితంగా పది షేర్స్ తగ్గకుండా తీసుకోవాలి. అప్పుడే అతనికి లాభం వస్తుంది. తక్కువగా షేర్స్ ఉన్న వారికి రోజు రోజు డ్రా చేసుకునేందుకు వీలు కల్పించారు. కానీ ఎక్కువ షేర్ తీసుకున్న వారికి ప్రత్యేకంగా ఒక పరిధిని ఏర్పాటు చేశారు. ఇలా చిన్నచిన్న వారిని ఆకర్షించి డబ్బులు చెల్లిస్తూ వారిని ఇతరులను చేర్పిస్తే లాభాలు వస్తాయని, షేర్స్ పెరుగుతాయని నమ్మించి ఇతరులతో కూడా పెట్టుబడి పెట్టిస్తారు.
వాట్సాప్ ద్వారా కూడా సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తారు. ఇలా నడుస్తున్న నేపథ్యంలో గత పది రోజుల కితం 7.2 మిలియన్స్ ఫ్రైజ్‌మనీ గెలిచారని చెప్పి ప్రత్యేకమైన ఆఫర్లతో కూడిన ప్లాన్లను రూపొందించారు. రెండు రోజుల్లో పెట్టిన పెట్టుబడి రెండింతలు, అధిక వడ్డీ అంటూ పెట్టారు. దాంతో చిన్నచిన్న వ్యాపారులు, కూలీలు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారికి తగ్గట్టుగా రూ.లక్ష నుంచి రూ. 10లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఉదాహరణకు యాప్‌లో రూ.50వేలు పెట్టుబడి పెడితే 150 రోజులపాటు ప్రతిరోజూ రూ.850 (రూ.1.27లక్షలు)తోపాటు అదనంగా మరో రూ.50 వేలు వస్తాయి. రూ.300 పెట్టి ఒక షేర్‌ను కొనుగోలు చేస్తే రెండు రోజులపాటు రోజుకు రూ.30 వడ్డీ అదనంగా రూ.660 వస్తాయి.
ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా..
డాయ్ యాప్ నిర్వాహకుడు 7.2 మిలియన్ డాలర్లు ప్రైజ్‌మనీ గెలిచానని, అందులోని తన లాభాలు తీసుకుని మిగిలిన వాటిని డాయ్లోని సభ్యులకు అందిస్తానని ప్రకటన చేశాడు. అందులో భాగంగా జూలై 26న ప్రత్యేకమైన ఆఫర్లు పెట్టడంతో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున సభ్యులుగా చేరినట్ల్లు సమాచారం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 370 మంది వరకు పెట్టుబడి పెట్టినట్లు వినికిడి.
రెండు రోజుల్లో పెట్టిన పెట్టుబడికి రెట్టింపుతోపాటు అధిక శాతం వడ్డీ కూడా ఇస్తానని యాప్ నిర్వాహకులు ప్లాన్లు రూపొందించడంతో ఒక్కొక్కరు రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు పెట్టబడి పెట్టారు. జూలై 28న చెల్లించాల్సి ఉండగా అదివారం కావడంతో ఇబ్బంది ఉందని, సోమవారం 29కి వాయిదా వేశారు. డాయ్ యాప్ ప్లాన్ల ప్రకారం సభ్యుల షేర్స్ డబ్బులు వచ్చి వారి ఐడీలో జమ చేసినట్లుగా చూపించారు. కానీ వాటిని డ్రా చేసేందుకు వీలు లేకుండా చేశారు.
మరుసటి రోజు యాప్‌లో తమ ఐడీలోని బ్యాలెన్స్ కూడా కనబడకుండా చేశారు. దాంతో చేసేది లేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నల్లగొండ టూటౌన్ పరిధిలో కేసు నమోదు చేసి బాధితులు ఇచ్చిన వివరాలతో విచారణ చేపట్టారు. కేవలం రూ.5లక్షల వరకు సీజ్ చేసినట్లు సభ్యులు చెబుతున్నారు. కానీ పోలీసులు ధ్రువీకరించడం లేదు.
పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం చేస్తాం
డాయ్ యాప్ గురించి ఇప్పటికే 7, 8 అకౌంట్లను సీజ్ చేశాం. అందులో కొంత నగదును కూడా సీజ్ చేశాం. యాప్‌కు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేయాలని సైబర్ క్రైమ్‌తోపాటు పోలీస్ సిబ్బందికి కూడా ఆదేశాలు ఇచ్చాం. మాకు ఫిర్యాదు చేసిన వారే కాకుండా పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్నాం. బాధితులను త్వరలో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం.
– శరత్ చంద్ర పవార్, నల్లగొండ ఎస్పీ