యాసంగి పంటల సాగు ప్రణాళికను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ సిద్ధంచేసింది. ఉమ్మడి జిల్లాలో గత యాసంగిలో 12,42,262 ఎకరాల్లో సాగవగా ప్రస్తుతం 12,76,355 ఎకరాల్లో సాగు కానున్నదని అంచనా వేసింది. గత యాసంగి కంటే సుమారు 35 వేల ఎకరాల్లో సాగు పెరిగే అవకాశముందని పేర్కొన్నది. ఈ సీజన్ సాగు ప్రణాళికకు అనుగుణంగా ఎరువులు, విత్తనాల సరఫరాకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
ఎరువులకు సర్కారుకు ప్రతిపాదనలు..
నల్లగొండ, నవంబర్ 2 : యాసంగి సీజన్‌కు ఎరువుల కొరత లేకుండా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1,49,111 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉన్నాయి. అందులో యూరియా 73,660 మెట్రిక్ టన్నులు, డీఏపీ 16,218, కాంప్లెక్స్ 40,014, ఎంపీవో 12,739, ఎస్ఎస్పీ 6,485 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉన్నది. వీటిల్లో ప్రస్తుతం యూరియా 21,610 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నది. కాంప్లెక్స్ 18,540, ఎంపీవో 1,400, ఎస్ఎస్పీ 1,070… మొత్తంగా 1,06,491 మెట్రిక్ టన్నులు ఎరువులు కావాలని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది.
గత సీజన్ కంటే ఈ సారి ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉండటంతో రైతులకు విత్తన కొరత లేకుండా జిల్లా వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ప్రధానంగా వరి విత్తనాలు 25,734 క్వింటాళ్లు, వేరు శనగ 40 వేల క్వింటాళ్లు, మినుము 150 క్వింటాళ్లు, పెసర 150 క్వింటాళ్లు అవసరం అవుతాయి.
విత్తన కొరత లేకుండా చర్యలు
తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి ఎంఎంటీయూ 1010, కేఎన్ఎం, జీజేసీ, చిట్టిపొట్టిలతోపాటు ప్రైవేటు విత్తన కంపెనీల నుంచి విత్తనాలు అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకున్నది. ఇప్పటికే వ్యవసాయ డివిజన్లవారీగా విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో సమావేశం నిర్వహించింది. రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీచేసింది.
పంట రైతు ఇష్టమే
కేంద్ర ప్రభుత్వం ఈ యాంసగి సీజన్లో ధాన్యం కొనుగోలు చేసినా చేయకున్నా తామే కొనుగోలు చేస్తామనే ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగుపై రైతులకు ఎలాంటి నిబంధనలు విధించలేదు. గత యాసంగిలో రా రైస్ మాత్రమే తీసుకుంటామని, బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం తిరస్కరించింది. ఈ బియ్యం ఎఫ్‌సీఐకి పెట్టకుండా తెలంగాణ ప్రభుత్వమే నష్టం భరించి తీసుకున్నది. ఈ సారి యాసంగిలో ఎలాంటి నష్టాన్ని భరించడానికైనా సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఈ సారి ఈ సీజన్లో రైతులు ఈ పంటలు మాత్రమే వేయాలనే నిబంధన పెట్టలేదు. దాంతో ఈ సారి వరి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది.
ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెడుతాం
గత యాసంగి సీజన్‌కు మించి ఈ సారి 25 వేల ఎకరాల్లో పంటల సాగు పెరిగే అవకాశం ఉన్నది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. విత్తనాల విషయంలో టీఎస్సీడ్స్తోపాటు ప్రైవేటు కంపెనీల ప్రతినిధులకు సూచనలు చేసి కావాల్సినవి అందుబాటులో ఉంచుతున్నాం. ఇక ఎరువులు 1.49 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా ప్రస్తుతం 42 వేల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఇంకా 1.06 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాము. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
-వై సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ
యాదాద్రి భువనగిరి జిల్లాలో 3లక్షల ఎకరాలు
భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 2 : జిల్లావ్యాప్తంగా యాసంగి పంటకు సంబంధించి అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2,14,747మంది రైతులకు గాను 3లక్షల ఎకరాల్లో పంటల సాగు చేపట్టనున్నారు. ఇందులో అత్యధికంగా 2.20లక్షల ఎకరాల్లో వరి, జొన్నలు-50, మొక్కజొన్న-20, బెంగాల్గ్రాం-50, గ్రీన్గ్రాం-50, బ్లాక్గ్రాం-50, హార్స్గ్రాం-80, వేరుశనగ-300, పొగాకు-10, ఇతరాత్ర ఆహార పంటలు-300, ఆహారేతర పంటలు 800ఎకరాల్లో సాగు చేయనున్నారు.
యాసంగి సాగుకు సమగ్ర ఏర్పాట్లు
యాసంగి పంట సాగుకు అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలో సాగుకు, రైతులకు పంటల ఎంపికలపై పూర్తి స్థాయిలో నివేదికలు రూపొందించాం. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా సమగ్ర చర్యలు చేపడుతున్నాం. పంటల ఎంపిక, సాగు పద్ధతులు, సందేహాల నివృత్తికి వ్యవసాయ శాఖాధికారులు రైతులకు అందుబాటులో ఉంటారు.
– అనూరాధ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, యాదాద్రి భువనగిరి
సూర్యాపేట జిల్లాలో 4.60లక్షల ఎకరాల్లో సాగు
సూర్యాపేట, నవంబర్ 2 : జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 4,60, 540 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా వరి సాగు 4,52,000 ఎకరాల్లో సాగు అవుతుందని తెలిపారు. ఇక వేరుశనగ 4 వేలు, పెసర-500, మినుములు-600, చెరుకు-400, మిల్లెట్స్-1000, కందులు 150 ఎకరాల్లో సాగు కానున్నట్లు అంచనా వేశారు. అధికారులు రైతులకు కావాల్సిన ఎరువులను దశల వారీగా తెప్పించి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 2016 కు ముందు సాధారణ పంటల సాగు 1.80లక్షల ఎకరాలు ఉండేది. మంత్రి జగదీశ్‌రెడ్డి పక్కా ప్రణాళికతో నీటిని సక్రమంగా వినియోగంలోకి తేవడంతో పంటల సాగుకు ఎలాంటి డోకా లేకుండా పోయింది.
కృష్ణా, గోదావరి, మూసి నదుల నీటి సక్రమ వినియోగంతో పాటు సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో సాగు విస్తీర్ణం ఏడాదికేడాదికి పెరుగుతున్నది. 2016-17లో 2.07లక్షలు, 2017-18లో 2.39లక్షలు, 2018-19లో 2.19లక్షలు, 2019 -20లో 3.85లక్షలు, 2020-21లో 4.37లక్షలు, 2021-22 4.68లక్షల ఎకరాలకు సాగు పెరిగింది. 2016-17తో పోలిస్తే 2022-23 యాసంగి సాగు రెండింతలైంది. జిల్లావ్యాప్తంగా 4.60లక్షల ఎకరాలు సాగువుతుందని అధికారులు అంచనా వేయగా అది 4.70లక్షల వరకు చేరుకునే అవకాశముంది.
సమాయత్తం అవుతున్నాం
వరి కోతలు ముగియగానే రైతులు యాసంగి పంటలు వేసేందుకు సిద్ధమౌతారు. రైతుల అభిరుచులకు అనుగుణంగా యాసంగి సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎరువులను తెప్పించడం, వాటిని జిల్లావ్యాప్తంగా పంపిణీ చేయడంతో పాటు యాసంగి పంటల సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎరువులకు కొరత లేదు. డిమాండ్‌కు తగ్గట్లు రైతులందరికి ఎరువులు సకాలంలో అందిస్తాం. రైతులు అధికారుల సూచనలు పాటించి సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలి.
– రామారావునాయక్, జిల్లా వ్యవసాయ అధికారి, సూర్యాపేట