మేళ్లచెర్వు, ఫిబ్రవరి 29 : మార్చి 8 నుంచి 12 వరకు మేళ్లచెర్వులో జరుగనున్న మహాశివ రాత్రి జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. ఆలయ ఆవరణలో జాతర ఏర్పాట్లపై గురువారం పలు శాఖల అధికారులు, నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. క్యూ లైన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణపై శ్రద్ధ చూపాలన్నారు.
జాతర మొదలయ్యే సమయానికి పనులు పెండింగ్ లేకుండా చూడాలని, లిఫ్ట్ ద్వారా గ్రామ శివారులోని ఎన్ఎస్పీ కాల్వలోకి నీటిని విడుదల చేయాలని సంబంధిత ఉన్నతాధికారులను ఫోన్లో ఆదేశించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ అప్పారావు., డీపీఓ సురేశ్, తాసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ ఖాజా అజ్గర్ అలీ, ఎస్ఐ పరమేశ్, ఈఓ కొండారెడ్డి, నాయకులు కొట్టె సైదేశ్వర్రావు, శాగంరెడ్డి గోవిందరెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంభిరెడ్డి, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.