కేతేపల్లి, నవంబర్ 20 : మండల పరిధి బొప్పారం గ్రామ శివారు మూసీ ప్రాజెక్టు వద్ద గల మహాత్మా జ్యోతిభా పూలే బీసీ గురుకుల పాఠశాలను బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు.మంగళవారం సాయంత్రం పాఠశాల విద్యార్థి బద్దం గణేశ్ పాముకాటు విషయం తెలుసుకున్న కలెక్టర్ అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, బాత్రూమ్లను, మురుగు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను ఆమె పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వంట గదులను, విద్యార్థి పాముకాటుకు గురైన ప్రదేశాన్ని పరిశీలించారు. పాముకాటుకు గురైన ప్రదేశంలో చెట్లు ఉండటాన్ని ఆమె గమనించి, వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. పలు విభాగాలకు చెందిన అధికారులు సక్రమంగా పనిచేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పాఠశాల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రిన్సిపాల్‌ను ఆమె మందలించారు. పాఠశాల ఆవరణలో మురుగు నీరు నిల్వ ఉండటం, చెత్తాచెదారం ఉండటం, చెట్లు పెరిగి ఉండటం, ఆటస్థలంలో వీధి కుక్కలు సంచరించడం ఏంటని కలెక్టర్ ఆమెను ప్రశ్నించారు.
అదే విధంగా పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టక పోవడంపై ఎంపీడీఓ, ఎంఈఓలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల నుంచి పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి హరీశ్‌పై ఆమె మండిపడ్డారు. ఏదైనా ప్రమాదం సంభవించినపుడు మాత్రమే అధికారులు హడావుడిగా పనిచేయడం మానుకోవాలని ఆమె హితవు పలికారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేయని నలుగురు కార్మికులను విధుల నుంచి తొలగిస్తునట్లు కలెక్టర్ ప్రకటించారు. వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వారిని నియమిస్తామని తెలిపారు. ప్రతి వారం పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల బాగోగులు చూసుకోవాలని ఎంపీడీఓ, ఎంఈఓలకు ఆమె సూచించారు. అనంతరం కలెక్టర్ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులకు అందుతున్న భోజన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట గురుకుల పాఠశాల రీజినల్ కో ఆర్డినేటర్ సంధ్య, తాసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, ఎంఈఓ రాజేంద్రప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ ధనమ్మ ఉన్నారు.