సూర్యాపేట రూరల్, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ పరిధిలోని పుల్లారెడ్డి చెరువు పక్కన నిర్వహించిన ఉమెన్ ట్రీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటిన మొక్కలను పరిరక్షించేందుకు మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తుందన్నారు.
అనంతరం పుల్లారెడ్డి చెరువు పక్కనే ఉన్న సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌లో నీటిని శుద్ధి చేసే విధానాన్ని పరిశీలించి ఇంజనీర్లకు తగిన సూచనలు చేశారు. మానసనగర్ రోడ్డు నెంబర్ 4లోని పూర్తి చేసిన రోడ్డును పరిశీలించారు. అభివృద్ధి పనులను సంబంధిత కాంట్రాక్టర్లు నాణ్యతతో పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు ఫీల్డ్‌పై ఉంటూ పనులు చేయించాలని, ఫైల్ ప్రాసెసింగ్ నియమ నిబంధనల ప్రకారం ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు, మున్సిపల్ ప్రత్యేక అధికారి శ్రీనివాస్, అధికారులు కిరణ్, సత్యారావు, రమాదేవి, శ్రీనివాస్, నరేందర్, రాజారెడ్డి, తిరుమలయ్య, ప్రసాద్, శ్వేత, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.