సూర్యాపేట, జూన్ 24 : ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించాలని, ఇక నుంచి వారానికి రెండు మార్లు ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు మండల, జిల్లా స్థాయి అధికారులు పనిచేయాలన్నారు.
జిల్లాలో ఎన్నికలు పూర్తయినందున అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ ప్రజావాణిలో 108 దరఖాస్తులు వచ్చాయని, అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 68, డీఆర్డీఓ 7, డీపీఓ 6, ఇతర శాఖలకు సంబంధించినవి 27 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు క లెక్టర్లు సీహెచ్ ప్రియాంక, బీఎస్ లత, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, డీఎఫ్ఓ సతీశ్‌కుమార్, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్, డీఎస్ఓ మొహన్‌బాబు, డీఎంఓ శర్మ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.