తుంగతుర్తి, జనవరి 02 : కలెక్టర్ గారు జర మా భూములు మాకు ఇప్పించండంటూ పలువులు రైతులు తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు జిల్లోదు సోమనారాయణ, జోగునూరి లాజరేస్ మాట్లాడుతూ.. 25 సంవత్సరాల క్రితం రావులపల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి విజయసేనారెడ్డి, సౌజన్య దేవి నుండి తాము 15 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అప్పటి నుండి కాస్తు కబ్జాలో ఉంటూ సేద్యం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు తమ భూములను తిరిగి వారికే పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించగా లీగల్ సమస్యలు న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి తిప్పి పంపారన్నారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.
బాధితుల ధర్నాకు బీఆర్ఎస్, సిపిఎం పార్టీల నాయకులు మద్దతు పలికారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, సీపీఎం మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, సిపిఎం సీనియర్ నాయకుడు ఓరుగంటి అంతయ్య, రావులపల్లి గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్, బాధితులు జోగునూరి లాజరస్, గొల్లపల్లి రామ్మూర్తి, ఇడుమాల మల్లయ్య, కసరబోయిన అవిలయ్య, కసరబోయిన వీరయ్య, దగ్గుల అవిలయ్య, శివరాత్రి విజయ్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.