సూర్యాపేట, మే 16 : ఈ నెల 27న జరుగనున్న వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, ఆర్డీఓలు, తాసీల్దార్లు, జిల్లా అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై అధికారులకు కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు. శాసన మండలి బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారని, ఎన్నికల నిర్వహణకు 142 జంబో బ్యాలెట్ బాక్సులను సత్యసాయి జిల్లా నుంచి తెప్పించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సూర్యాపేటలో 31 పోలింగ్ కేంద్రాలు, కోదాడలో 22, హుజూర్‌నగర్‌లో 18.. మొత్తం 71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో 51,497 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
పోలింగ్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. జూన్ 9న జరిగే గ్రూప్ 1 పరీక్షలకు జిల్లాలో 40 సెంటర్లు ఏర్పాటు చేశామని, 9,744 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలకు జిల్లాలోని అన్ని కేంద్రాల్లో బందోబస్తుకు పోలీసు సిబ్బందిని కేటాయించామన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదని, అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఆర్టీసీ, విద్యుత్, రోడ్లు, భవనాల శాఖలు సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సీహెచ్.ప్రియాంక, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి వీవీ అప్పారావు, బ్యాలెట్ బాక్సెస్ నోడల్ అధికారి సురేశ్‌కుమార్, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ శ్రీధర్‌రెడ్డి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ రూపేందర్‌సింగ్, వెహికిల్ ట్రాన్స్‌పోర్టు నోడల్ అధికారి సురేశ్‌రెడ్డి, ఎంసీసీ నోడల్ ఆఫీసర్ వి.సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.