సూర్యాపేట, డిసెంబర్ 15 : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఏర్పడిన నాటి నుంచి టీఎస్ ఐపాస్‌లో భాగంగా 20 శాఖలకు సంబంధించి 952 దరఖాస్తులు అందినట్లు వాటిలో ఇప్పటి వరకు 758 దరఖాస్తులు పరిశీలించి అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు కేవలం 127 మాత్రమే తిరస్కరణకు గురైనట్లు వెల్లడించారు.
జిల్లాలో ఎక్కువగా రైస్ మిల్లులు, ప్లాస్టిక్, సిమెంట్ ఫ్యాక్టరీలు, సిమెంట్ బ్రిక్స్‌కు దరఖాస్తులు చేసుకుంటున్నట్లు చెప్పారు. టీ ప్రైడ్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను ఆర్థిక స్వాలంభన దిశగా పారిశ్రామిక రంగంలో ఎక్కువగా ప్రొత్సహించాలన్నారు. ఈ పథకంలో ఎస్సీలకు 18, ఎస్టీలకు 131, దివ్యాంగులకు ఒక యూనిట్‌కు ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో త్వరలోనే సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జీఎం పరిశ్రమలు తిరుపతయ్య, శ్రీదేవి, శంకర్‌బాబు పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో దివ్యాంగుల సమస్యలపై వచ్చే ఫిర్యాదులను ప్రత్యేకంగా స్వీకరించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు.
మీ సేవలో సదరన్ సర్టిఫికెట్స్ ప్రమోషన్‌పై జరుగుతున్న ఇబ్బందులపై అధికారులతో విచారణ జరిపిస్తామని చెప్పారు. అనంతరం క్రీడా పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జ్యోతి పద్మ, డీఎంహెచ్ఓ కోటాచలం, డీఎస్పీ నాగభూషణం, దయానందరాణి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డీఈఓ అశోక్ పాల్గొన్నారు.
పాల ఉత్పత్తుల్లో జిల్లాను నంబర్ వన్‌గా ఉంచాలని అందుకు సోసైటీలను బలోపేతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో సొసైటీలు కో ఆపరేటివ్ మూవ్మెంట్స్ బలోపేతం చేయడానికి నియమించిన కమిటీలు ప్రత్యేక కృషి చేయాలన్నారు.
త్వరలో జిల్లాలో ఉన్న డైరీ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మత్స్య శాఖలో 160 సోసైటీలు ఉండగా 115 సోసైటీలకు ఎన్నికలు నిర్వహించామని మిగిలిన సోసైటీల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీసీఓ శ్రీధర్, డీఎహెచ్‌ఓ శ్రీనివాస్, డీఎఫ్ఓ రూపేంద్రసింగ్, డీఎం డీసీసీబీ వసంతరావు పాల్గొన్నారు.