సూర్యాపేట, మే 15 : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేయాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణపై అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి బుధవారం జిల్లా అధికారులతో వెబెక్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నందున జిల్లాలోని 71 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రతి డివిజన్లో పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందిని సమకూర్చాలని సూచించారు. ఎఫ్ఎస్టీ బృందాలు నిఘా పెంచాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం నేడు నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరూ సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ అప్పారావు, ఆర్డీఓలు వేణుమాధవ్, శ్రీనివాస్, సూర్యనారాయణ పాల్గొన్నారు.