నీలగిరి, జూన్ 1 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 12 జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఏఆర్ఓలకు ఓట్ల లెకింపుపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెకింపు మొదటి రౌండ్ చాలా ముఖ్యమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల ఎదురుగా బ్యాలెట్ బాక్స్‌ల సీల్ తీయాలని, అవసరమైన మెటీరియల్ అన్నింటినీ వారి ఎదురుగానే నిర్వహించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, ఏజెంట్లు ఇంకు పెన్నులు, వాటర్ బాటిళ్లు, సెల్ ఫోన్ వంటివి తీసుకురావడానికి వీలులేదని చెప్పారు.
నల్లగొండలోని దుప్పలపల్లి గోదాములోని 4 హాళ్లలో ఓట్ల లెకింపు చేపడుతామని, ఇందుకోసం 96 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఒకో హాల్లో 24 టేబుళ్లు ఉంటాయని చెప్పారు. ఉదయం 6 గంటలకు ఓట్ల లెకింపు సిబ్బంది కేంద్రం వద్ద హాజరు కావాలని, ఉదయం 8 గంటలకు ఓట్ల లెకింపు ప్రారంభమవుతుందని అన్నారు. ప్రతి హాల్‌కు అదనపు కలెక్టర్, ఒక ఏఆర్ఓ ఇన్చార్జిగా ఉంటారని, ఆర్టీఓ స్థాయి అధికారులు ఇద్దరు ఉంటారని, 12 టేబుళ్లకు ఒక ఆర్డీఓ ఇన్చార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. కౌంటింగ్ సూపర్వైజర్లకు ఇదివరకే శిక్షణ ఇచ్చామని, మరోసారి 3వ తేదీన శిక్షణ ఇవ్వనున్నామని వెల్లడించారు.
మొదటి రౌండ్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నవారు, రెండో షిఫ్ట్ ఉద్యోగులు వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా టేబులేషన్, ఓట్ల లెకింపు, రిపోర్టులు, మొదటి రౌండు కౌంటింగ్ అంశాలపై మాట్లాడారు. ఓట్ల లెకింపులో తేడా రాకుండా చూసుకోవాలన్నారు. మూడు రౌండ్ల వరకు పూర్తి స్థాయిలో బండిల్స్ లెకిస్తారని, నాలుగో రౌండ్ సైతం ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ అన్నింటినీ కలుపుకొని బ్యాలెట్ పేపర్ లెకించాల్సి ఉంటుందని, చెల్లుబాటు ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను జాగ్రత్తగా పరిశీలించి లెకించాలని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, 12 జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, ఏఆర్ఓలు పాల్గొన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన కోరారు. కలెక్టరేట్లో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లతో కౌంటింగ్ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ మొత్తం 96 టేబుళ్లలో ఓట్ల లెకింపు ఉంటుందని, ఒకో టేబుల్‌కు ఒక ఏజెంటును అభ్యర్థులు నియమించుకోవచ్చన్నారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఒక ఏజెంట్ లేదా అభ్యర్థిగాని ఉండవచ్చని తెలిపారు.
ఈ నెల 2వ తేదీలోపు ఏజెంట్ల పేర్లు, ఫొటోలు ఇచ్చి ఐడెంటిటీ కార్డులను తీసుకోవాలని చెప్పారు. ఈ నెల 5న ఉదయం 6 గంటలకు అభ్యర్థులు, వారి ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ దగ్గర హాజరు కావాలని తెలిపారు. ఎన్నికల ఏజెంట్లు పెన్సిళ్లు, జెండాలు, పార్టీ గుర్తుల వంటివి ధరించి కౌంటింగ్ కేంద్రంలోకి రాకూడదన్నారు. ఏజెంట్లకు పెన్నులు, పేపర్లను కౌంటింగ్ హాల్లో ఇస్తారని తెలిపారు. అదనపు కలెక్టర్లను కౌంటింగ్ హాళ్లకు ఇన్చార్జి అధికారులుగా నియమించామని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తోపాటు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఏఆర్ఓలు నల్లగొండ దుప్పలపల్లి గోదాము వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.