నల్లగొండ, మే 10 : నల్లగొండ పార్లమెంట్ స్థానానికి మే 13న పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆమె పార్లమెంట్ ఎన్నికలు, శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికపై మీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిచందన మాట్లాడుతూ ఈ నెల 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు.
ఇప్పటికే జిల్లా కేంద్రం నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలు పంపించామని, ఈ నెల 12న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఆయా పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సిబ్బందితోపాటు ఈవీఎంలు చేరుకుంటాయని చెప్పారు. అభ్యర్థులు ఈ నెల 11న సాయంత్రం తమ ప్రచారాలను నిలిపివేయాలని, ప్రచారాలు నిలిపివేసిన సమయం నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యంపై నియంత్రణ ఉంటుందని అన్నారు. ఇక వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికకు 69 మంది అభ్యర్థులు దాఖలు చేయగా స్కూటినీలో ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరసరించామని ఆమె చెప్పారు.
ఈ నెల 13న 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, శని, ఆదివారాలు సెలవు ఉంటుందని తెలిపారు. నల్లగొండ శివారులోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న రాష్ట్ర గిడ్డంగుల శాఖ గోదాములో జూన్ 5న కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, శాసన మండలి పట్టబద్రుల సహాయ రిటర్నింగ్ అధికారి సీహెచ్ మహేందర్, ఏఆర్ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, పార్లమెంట్ ఎన్నికల డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యు.వెంకటేశ్వర్లు, మీడియా డల్ అధికారి, ఇండస్ట్రీస్ జీఎం కోటేశ్వర రావు పాల్గొన్నారు.