రామగిరి, సెప్టెంబర్ 10 : వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని వల్లభరావు చెరువును ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16న గణేశ్ నిమజ్జనం నిర్వహిస్తుండగా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వల్లభరావు చెరువుతోపాటు 14వ మైలురాయి నాగార్జున సాగర్ బ్రిడ్జి కింద, నిమజ్జనం జరిగే జిల్లాలోని అన్ని ప్రదేశాల్లో బారికేడింగ్, క్రేన్స్ ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ ఈఈని ఆదేశించారు. వల్లభరావు చెరువులో 9 ఫీట్లు కంటే తక్కువ ఉన్న విగ్రహాలను, అపై పెద్దగా ఉన్న వాటిని సాగర్ 14వ మైలురాయికి తరలించాలని తెలిపారు.
మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10గంటల వరకు నిమజ్జనం జరుగుతుందని, ట్రాఫిక్ మళ్లింపుతోపాటు బందోబస్తు , పారిశుధ్యం వంటి చర్యలు చేటపట్టాలని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. వల్లభరావు చెరువులో నిమజ్జనానికి అవసరమైన నీటిని అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా డి- 37, 39తోపాటు అన్ని డిస్ట్ట్రిబ్యూటర్ల కింద ఆయకట్టు చివరి భూములకు సాగునీరు వెళ్లేవిధంగా చూడాలన్నారు.
ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ తాగునీటి చెరువులలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని, ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వినాయక నిమజ్జనం రోజు పోలీసు బందోబస్తులో ఉన్న సిబ్బందికి రేడియం స్టిక్కర్స్‌ను ఏర్పాటు చేస్తే బాగుటుందని, సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేయాలని తెలిపారు. వారి వెంట అదనపు కలెక్టర్ పూర్ణచందర్, ఏఎస్పీ రాములునాయక్, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణరెడ్డి , ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, జిల్లా అగ్నిమాప, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.