నల్లగొండ సిటీ డిసెంబరు 7 : సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన ఆర్టీసీ ప్రయాణికులను అవస్థల పాలు చేసింది. అధికారులు అత్యధిక బస్సులను సభ కోసం పంపించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. నల్లగొండ రీజియన్ పరిధిలోని వివిధ రూట్లలో రోజూ 634 బస్సులను నడిపిస్తుంటారు. కాగా, శనివారం సీఎం సభకు జనాన్ని తరలించేందుకు 265 బస్సులను ఆర్టీసీ అధికారులు కేటాయించగా, 369 బస్సులు మాత్రమే ప్రయాణికుల కోసం ఆయా రూట్లలో నడిపారు. కొన్ని రూట్లకు అసలు బస్సులే పంపలేదు. రోజువారీగా నడిచే ట్రిప్పులతో చూస్తే బుధవారం ఒక్క నల్లగొండ రీజియన్ నుంచే 800 ట్రిప్పులు తగ్గాయి. రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, మాచర్ల రూట్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వచ్చిన కొన్ని బస్సులు కిక్కిరిశాయి. ఇతర జిల్లాల నుంచి మరో 450 బస్సులను సీఎం సభకు రప్పించారు.
డీపోల వారీగా తరలించిన బస్సులు..
నల్లగొండ : 60
దేవరకొండ : 60
మిర్యాలగూడ : 36
యాదగిరిగుట్ట : 30
కోదాడ : 35
సూర్యాపేట : 44