యాదగిరిగుట్ట, మార్చి11 : పంచ నారసింహుడిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక, నవాహ్నిక బ్రహ్మోత్సవాలు పంచరాత్రాగమ శాస్త్రయుక్తంగా ప్రారంభించారు. సోమవారం ప్రభాత వేళ ప్రధానాలయంలో నిత్యపూజ కైంకర్యాల అనంతరం వైశేక హోమాలు, ప్రత్యేక తిరుమంజనం జరిపారు. స్వామివారిని బంగారం, వజ్రవైడూర్యాలు, వివిధ రకాల పూలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రధానాలయ ముఖ మండపంలో వేంచేపు చేశారు.
విష్వక్సేనారాధన, నవకలశాభిషేకం, స్వస్తీవాచనం, రక్షాబంధనం, మంత్రపుష్ప నీరాజనాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం నిర్వహించారు. అంతకుముందు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈఓ రామకృష్ణారావు, ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు స్వా మివారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మోత్సవాలకు స్వామివారి అనుమతి స్వీకరించారు.
పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలకంరించిన స్వామివారిని ప్రధానాలయం ముఖ మండపంలో తూర్పునకు అభిముఖంగా అధిష్టింపజేశారు. స్వామివారికి నవకలశాభిషేకం అనంతరం బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని, లోకాలకు శుభాలు కలుగాలని వేద మంత్రాలను పఠిస్తూ పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో విష్వక్సేన ఆరాధన జరిపారు. లోకమంతా సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ స్వస్తీవాచన మంత్రాలతో భగవానుడిని వేడుకున్నారు.
శుద్ధజలాలతో స్వామివారి ప్రధానాలయం, గర్భాలయం, ఆలయ మాఢవీధులు, ప్రాకార మండపాలను సంప్రోక్షణ చేశారు. రక్షాబంధనాలను ప్రత్యేక పాత్రలో ఉంచి విమల మొదలగు అష్టదళ శక్తి దేవతలను ఆవాహనం చేసి మంత్రాలు, ధూప దీపాలను సమర్పిస్తూ రక్షాబంధనం జరిపారు. అనంతరం నారసింహులకు, ఆండాళ్ అమ్మవారు, ఆళ్వారు, రామానుజాచార్యులు, విష్వక్సేనుడు, ఉత్సవమూర్తులకు కంకణధారణ చేశారు. పూజా కార్యక్రమాలను ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్య బృందం, ఆలయ అర్చక బృందం, పారాయణందార్లు అత్యంత వైభవంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యారాధనల అనంతరం సాయంత్రం 6:30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ వేడుకలను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం శాస్ర్తానుసారంగా నిర్వహించింది. అంకురారోపణకు అవసరమైన మట్టి కోసం ఆలయ అర్చక బృందం మంగళవాయిద్యాలతో వెళ్లి భూమాతను పూజించి పుట్టమన్ను స్వీకరించింది. మట్టిని కొత్త పాలికలో పోసి నవధాన్యాలు వేసి మంత్ర జపములతో ప్రోక్షణ చేసింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన తొలి పూజల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య దంపతులు పాల్గొన్నారు. ప్రధానాలయం ముఖ మండపంలోని ధ్వజస్తంభం ముందు భాగంలో చేపట్టిన స్వస్తీవాచనం, పుణ్యాహవచనంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.
మొదటగా పంచనారసింహుడిని దర్శించుకుని కుటుంబం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్ర్తాలు, ఆయన సతీమణి గీతారెడ్డి ముత్యాల తలంబ్రాలు, పండ్లను స్వామివారికి సమర్పించారు. ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వారికి ఆశీర్వచనం అందించారు. కాండూరి వేంకటాచార్యులు కంకణధారణ గావించారు. వారి వెంట ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ట, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6:30 గంటలకు భేరి పూజ, దేవతాహ్వానం, హవనం కార్యక్రమాలు జరుగనున్నాయి.