సూర్యాపేట, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తుఫాన్ కారణంగా వచ్చిన వరదల్లో సర్వం కోల్పోయిన వారికి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వరద ప్రాంతాలను పరిశీలించేందుకు సోమవారం ఖమ్మం జిల్లాకు వెళ్తున్న ఆయన మోతె మండల కేంద్రంలో ఆగారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించారు. వరద నష్టానికి సంబంధించిన ఫొటోలను పరిశీలించి పంట, ఆస్తి నష్టం వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సమీక్షలో సీఎం సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవగా.. కోదాడ, హుజూర్‌నగర్‌లో తీరని నష్టం జరిగినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చెప్పారని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వరదల్లో చిక్కుకొని చనిపోయిన వారి కుటుంబానికి రూ.5లక్షలు, మృతిచెందిన పశువులకు రూ.50వేలు, గొర్రెలు, మేకలకు 5వేలు, నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు.
తక్షణ సాయంగా కలెక్టర్ ఖాతాకు రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులతోపాటు ఇండ్లు కోల్పోయిన వారికి అండగా ఉంటామని, దైర్యంగా ఉండాలని అన్నారు.
వర్షాలు తగ్గిన వెంటనే రూ.23 కోట్లతో మరమ్మతులు చేయిస్తానన్నారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రణప్రీత్సింగ్, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.