అడవిదేవులపల్లి, అక్టోబర్ 19 : ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిన అడవిదేవులపల్లి.. స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ప్రత్యేక శ్రద్ధ వహించడంతో మండల కేంద్రం రూపురేఖలు మారిపోయాయి.
అడవిదేవులపల్లిని గత పాలకులు పట్టించుకోక పోవడంతో కనీస వసతులు కరువై ప్రజలు అవస్థలు పడ్డారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి ద్వారా అధిక నిధులు విడుదల చేశారు. రూ.13 లక్షలతో వైకుంఠధామం, రూ.2.40 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్, రూ.3 లక్షలతో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశారు. దాంతో పాటు రూ. 60 లక్షలతో అన్ని వార్డుల్లోని అంతర్గత రోడ్లను సీసీగా మార్చారు. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్‌తో ప్రతి ఇంటికీ వెళ్లి నిత్యం చెత్తను సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తుండడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది.
మండల కేంద్రంలోని హరిజనవాడలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.75,65,880తో పాఠశాలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టడంతో పాటు మౌలిక వసతులు కల్పించింది. పాఠశాలను కార్పొరేట్‌కు దీటుగా రూపొందించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు మండల కేంద్రలో కస్తూర్బా పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మించారు.
అడవిదేవులపల్లి నుంచి మిర్యాలగూడ వెళ్లే ప్రధాన రహదారి నుంచి బస్టాండ్ వరకు సుమారు 400 మీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా, ఇరుకుగా మారడంతో ప్రజలు, వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రోడ్డు నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేయించారు. ప్రభుత్వం అందించిన నిధులతో రోడ్డును పూర్తిస్థాయిలో సీసీగా మార్చారు. రోడ్డు కూడా వెడల్పు చేయడంతో ప్రజల ఇబ్బందులు తీరాయి.
మండల కేంద్రంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సహకారంతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రభుత్వం అందించిన నిధులతో కొత్త ప్రభుత్వ భవనాలు, సీసీరోడ్లు, పల్లెప్రకృతివనం, కంపోస్ట్ షెడ్, వైకుంఠధామం నిర్మించాం. పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాం. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నాం.
– కొత్త మర్రెడ్డి, సర్పంచ్, అడవిదేవులపల్లి