గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే మండల స్థాయిలో పూర్తికాగా సోమవారం నుంచి ఈ నెల 24 వరకు మూడు రోజులపాటు జిల్లా స్థాయిలో నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ స్టేడియం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. సూర్యాపేటలో అదనంగా అథ్లెటిక్స్‌కు ఎస్వీ డిగ్రీ కళాశాలలో, బ్యాడ్మింటన్‌కు పబ్లిక్ క్లబ్లో ఏర్పాట్లు చేశారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తర్వాత పోటీలు జరిపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
– నల్లగొండ, మే 21
1400 మంది క్రీడాకారులు
ప్రతిభ కనబర్చినవారు రాష్ట్ర స్థాయికి
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసి ఈ నెల 28 నుంచి 31 వరకు రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న పోటీలకు పంపనున్నారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారికి వ్యక్తిగత, జట్టుగా నగదు, మెడల్స్ అందిస్తారు. వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్, రూ.20 వేల నగదు, రెండో స్థానానికి సిల్వర్ మెడల్ రూ.15 వేల నగదు, మూడో స్థానానికి కాంస్య పతకం,రూ. 10 వేల నగదు ఇవ్వనున్నారు. ఇక జట్టుకు గోల్డ్ మెడల్‌తో పాటు రూ. లక్ష నగదు, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు సిల్వర్ మెడల్ రూ. 75 వేలు, మూడో స్థానానికి కాంస్య పతకం రూ. 50 వేల నగదు అంద జేయనున్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు క్రీడా పోటీలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మెడికల్ సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచుతున్నారు.