నందికొండ, ఆగస్టు 11 : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టడంతో ఎన్నెస్పీ అధికారులు సోమవారం డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను నిలుపుదల చేశారు. నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీగా రావడంతో ఈ నెల 5న క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. 5నుంచి 12వరకు రోజూ 2నుంచి 3లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 8రోజుల పాటు 175 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.
సోమవారం ఉదయం 8 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగించగా.. ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో క్రస్ట్ గేట్లను క్రమంగా తగ్గిస్తూ సోమవారం మధ్యాహ్నం 2గంటలకు పూర్తిగా నిలుపుదల చేశారు. వరద ఉధృతిని బట్టి క్రస్ట్ గేట్ల ద్వారా మళ్లీ నీటి విడుదల చేపడుతామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గానూ ప్రస్తుతం 588.80 (308.4658 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. సాగర్ రిజర్యాయర్ పూర్తి స్థాయికి చేరుకోవడంతో నిండుకుండలా మారి జలకళను సంతరించుకుంది.
కృష్ణా పరీవాహక ప్రాంతాల్లోని ఆల్మట్టి, నారాయణపుర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 1,29,430 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 47,319 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది. ఎడమ కాల్వ ద్వారా 8,541 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 6,253, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 30,125, వరద కాల్వ ద్వారా 600 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.
టెయిల్‌పాండ్ నుంచి నీటి విడుదల నిలిపివేత
అడవిదేవులపల్లి, ఆగస్టు 12 : మండల కేంద్రానికి చేరువలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదలను సోమవారం నిలిపివేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి సుమారు 29,841 క్యూసెక్కుల నీరు వస్తుందని ఏఈ జైపాల్ తెలిపారు. టెయిల్‌పాండ్ నీటి నిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.501 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు చెప్పారు.