– ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
– స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో నిరసన
– డీఈఓ భిక్షపతికి వినతి పత్రం సమర్పణ
రామగిరి, ఏప్రిల్ 06 : నల్లగొండ జిల్లాలో గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎస్.ఎస్.సి. స్పాట్ వాల్యుయేషన్‌లో ఏఈ, సీఈ, స్పెషల్ అసిస్టెంట్, ఇతర విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు వెంటనే రెన్యుమరేషన్ బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం నల్లగొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లోని ఎస్ఎస్సీ స్పాట్ మూల్యాంకన కేంద్రంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిరసన చేపట్టి జిల్లా విద్యాశాఖాధికారి బి.భిక్షపతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది గడుస్తున్నా నేటికీ గత సంవత్సరపు మూల్యాంకన రెమ్యూనరేషన్, టి.ఏ., డి.ఏ.లు చెల్లించలేదన్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సి పరీక్షలు కూడా ఈ నెలలో పూర్తి కానున్నాయని, మూల్యాంకనం కూడా ప్రారంభం అయిందని, కానీ గత సంవత్సరపు రెమ్యూనరేషన్ కూడా ఇప్పటికీ ఇంకా చెల్లించని కారణంగా స్పాట్ విధులు నిర్వహించడం పట్ల చాలామంది ఉపాధ్యాయులు ఆవేదనలో, అనాసక్తితో ఉన్నారన్నారు.
ఈ నేపథ్యంలో రెమ్యునరేషన్ బకాయిలు సత్వరం చెల్లించాలనే డిమాండ్ తో ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో స్పాట్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గతేడాది ఎస్.ఎస్.సీ స్పాట్ విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు వెంటనే పెండింగ్ లో ఉన్న రెమ్యునరేషన్ బకాయిల డబ్బులు సత్వరం చెల్లించాలని, ఈ సంవత్సరం కూడా SSC స్పాట్ వాల్యుయేషన్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు స్పాట్ వాల్యుయేషన్ ముగిసిన వెంటనే వారి రెన్యుమరేషన్, టీఏ, డీఏ లను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని, లేనియెడల ఈ సంవత్సరం ఎస్.ఎస్.సీ. స్పాట్ విధుల బహిష్కరణకు అనివార్యంగా పిలుపు ఇవ్వవలసి వస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీయూఎస్, టీఆర్టీఎఫ్, ఎస్టీయూ, డీటీఎఫ్, జీటీఏ, డీటీయూ, ఎస్సీఎస్టీయూఎస్ ఉపాధ్యాయ సంఘాల జిల్లా బాధ్యులు బత్తిని భాస్కర్ గౌడ్, తరాల పరమేశ్ యాదవ్, రేణికుంట్ల రాజశేఖర్, నిమ్మనగోటి జనార్దన్, తండు భానుప్రకాష్ గౌడ్, మురారిశెట్టి రtమేష్, బి.వెంకటేశం, పి.వెంకులు, దూదిగామ స్వామి, వెంకటేశ్వర్లు, ఈసం రాంబాబు, మండల బాధ్యులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

‘గతేడాది పదో తరగతి మూల్యాంకనం రెన్యూమరేషన్ బకాయిలు వెంటనే చెల్లించాలి’