నీలగిరి, జూన్ 06 : ప్రజల భాగస్వామ్యం తోనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం రెండో విడతగా 13, 14, 15, 16, 17, 21, 22, 23, 24, 44, 45, 46లలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి స్థానిక సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. చెత్తను మూలం వద్దనే వేరు చేయడం ద్వారా పరిశుభ్రమైన నగర నిర్మాణంతో పాటు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ సాధ్యమవుతుందన్నారు. జల్ సంచయ్ – జల్ భాగీధారి కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, రూఫ్‌టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ చర్యల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి కుటుంబం వర్షపు నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని, భూగర్భ జలాల పెంపునకు సహకరించాలని పిలుపునిచ్చారు.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపడుతున్న డ్రైనేజీల పూడికతీత పనులు, మురుగు కాలువల శుభ్రత, వర్షాకాల సన్నద్ధత చర్యల గురించి ప్రజలకు వివరించారు. డ్రైనేజీలలో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని, నీటి ప్రవాహానికి ఆటంకాలు కలగకుండా చూడాలని సూచించారు. నగరంలో తాగునీటి సరఫరా, పైప్‌లైన్ నిర్వహణ, పారిశుధ్య సేవలు, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రహదారుల అభివృద్ధి, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిరంతరంగా చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. పచ్చదనం పెంపు ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దోమల వ్యాప్తిని నివారించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తాగునీటిని శుద్ధి చేసి వినియోగించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని ప్రజలకు సూచించారు.
వార్డు సభలలో ప్రజల నుండి తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీలు, వీధి దీపాలు, రహదారులు, వర్షపు నీటి పారుదల, పార్కుల అభివృద్ధి, ప్రజా సౌకర్యాలు, ఇతర స్థానిక సమస్యలపై వినతులు, ఫిర్యాదులు, సూచనలు స్వీకరించారు. అందిన ప్రజా ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నగర ప్రజలు చురుకుగా పాల్గొనాలని, రాబోయే విడతల వార్డు సభలకు కూడా పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు మందడి లిఖిత సైదిరెడ్డి, దొడ్డి రమేశ్, గోపరాజు స్వాతి రాజశేఖర్, మొహమ్మద్ ఇబ్రహీం, రఫియోద్దీన్, వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు, శానిటరీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర