నల్లగొండ రూరల్ , మార్చి 7: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల 5వ తేదీ లోపు గ్రీన్‌ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల మెడకు గుదిబండలా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎంపీడీవో కార్యాలయం ముందు శుక్రవారం నాడు కార్మికులతో కలిసి ఆయన ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామపంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దుచేసి.. అందరిని పర్మనెంట్ చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మరిచిపోయారని అన్నారు. వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గత జనవరి నుంచి గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి రెండు నెలలు పూర్తయినప్పటికీ.. కార్మికులకు వేతనాలు సకాలంలో రాక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వడానికి బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఎస్టీవోలో పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కార్మికులకు పనిలో వెసులుబాటు కల్పించి ఒక్క పూట పనుల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పంచాయితీల బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్ ఎత్తేయాలని, కార్మికులకు తక్షణమే వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు చింతకింది భద్రయ్య , వడ్డెగాని యాదయ్య, పోలే నాగమణి, పొట్టపంగా సైదులు, మల్లేశ్, సైదమ్మ, అంజమ్మ యాదయ్య, సుధాకర్, మహేందర్, సైదమ్మ, నవనీత, లింగస్వామి , రవి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.