గట్టుప్పల్, మే 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులను సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేశ్ తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సిబిల్ స్కోర్ నిబంధన వెంటనే ఎత్తివేయాలని, లేనియెడల యావత్ తెలంగాణ రాష్ట్ర యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నట్లు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈబీసీ లలో ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.6 వేల కోట్లతో 5 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయం చేసి దరఖాస్తులు స్వీకరించిందన్నారు.
ప్రభుత్వ నిర్ణయతో 16 లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయిన తరువాత సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం లబ్ధిదారుల నోట్లో మట్టికొట్టడమే అవుతుందని విమర్శించారు. అంబేద్కర్ అభయహస్తం ఊసే లేదని, రూ.1 లక్ష నుండి 4 లక్షల నిబంధనతో పేదల బతుకుల్లో ఎలాంటి మార్పు రాదన్నారు. కనీసం రూ.10 లక్షలు వరకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.