సమైక్య పాలనలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉండేవి. బోర్లు, బావుల నుంచి నీటిని తెచ్చుకొని తాగే పరిస్థితి. నీటిలో ఫ్లోరోసిస్ ఉండడంతో ఎంతోమంది ఎముకల నొప్పులతో బాధపడేవారు. కాళ్లు, చేతులు, నడుము వంకర పోయి కొందరు జీవచ్ఛవాలుగా మారారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే కలరా, డయేరియా వంటి వ్యాధులు చుట్టుముట్టేవి. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయేవి. మారుమూల గ్రామాలు, తండాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండేది.
వీటన్నింటినీ దూరం చేసేలే ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. 2016 నుంచి ఇంటింటికీ సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. దాంతో కలుషిత నీటి వ్యాధులు దూరమయ్యాయి. కలరా, అతిసారం వంటి వ్యాధులు కనుమరుగయ్యాయి. ఫ్లోరోసిస్ అనే మాటే లేదు. ప్రస్తుతం దవాఖానలకు సాధారణ జ్వరాలు, ఇతరత్రా కేసులు మాత్రమే వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. జిల్లాలోని 17 మండలాల్లోని 769 గ్రామీణ ఆవాసాలు, 6 మున్సిపాలిటీల్లో 1,84,546 ఇండ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం రూ. 884 కోట్లు ఖర్చు చేసి తాగునీటిని అందిస్తున్నది.
మిషన్ భగీరథ పథకం గ్రామీణ ప్రజలకు ఆరోగ్య జీవనాన్ని అందించింది. ఈ పథకం ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన జలాలతో ఫ్లోరోసిస్ కనుమరుగవగా కలరా, డయేరియా, టెఫాయిట్ వ్యాధులు మాయమయ్యాయి. నీటి కలుషిత వ్యాధులతో వందలాది మంది ఆస్పత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. గలగల పారే స్వచ్ఛమైన గోదావరి జలాలతో జిల్లాలోని మారుమూల పల్లెలు సైతం మురిసిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 769 ఆవాస గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధమైన జలాలు అందిస్తున్నారు.
మానవుడికి సోకే వ్యాధులు 80 శాతం నీటి ద్వారానే సంక్రమిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. పారిశ్రామిక, మానవ, జంతు సంబంధ, రసాయన వ్యర్థాలతో నీరు కలుషితమవుతాయి. కలుషిత నీటిని తాగడంతో అమీబియాసిస్, జియార్డిసిస్, టాక్సోప్లాస్మోసిన్, కలరా, అతిసార, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ,ఈ వంటి వ్యాధుల బారిన పడేవారు. వీటితోపాటు ప్రమాదకర ఫ్లోరైడ్, ఇనుము, లవణీయత కలిగిన నీటిని సేవించి ఫ్లోరోసిస్ బారినపడ్డారు. గ్రామీణ ప్రజలకు ఈ నీటి ద్వారా ఎక్కువ ప్రమాదం ఉందని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం శుద్ధి జలాలను అందించాలన్న లక్ష్యంతో 2016 ఆగస్టులో మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది.
మిషన్ భగీరథ పథకం ద్వారా అందజేస్తున్న నీటిని వివిధ రకాల ప్రక్రియల్లో శుద్ధ జలాలుగా మారుస్తారు. ఏరియేటర్ ప్రక్రియతో నీటికి కావాల్సిన ఆక్సిజన్‌ను కలుపడంతో సీఎం-2, హెచ్-2, ఎస్ గ్యాస్, ఎఫ్ఈ, ఎంజీ, ఎంఎన్ లవణాలను తొలగిస్తారు. ప్రీక్లోరినేషన్ ప్రక్రియతో నీటిలో బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగస్, దుర్వాసనను తొలగిస్తారు. నీటిలో రంగు, టర్పిడిటీ, నీటి వాసనను తగ్గించి, సూక్ష్మ కణాలను తొలగించేందుకు వివిధ రకాల స్పటికాలను కలుపుతారు. దుమ్ము, ధూళి వంటి సూక్ష్మ కణాలు, పెద్ద ముద్దలుగా మార్చి బరువుగా మారి ట్యాంకులో కిందికి దింపడం, మట్టి ముద్దులుగా ఉన్న నీటిని బయటికి వదలడంతోపాటు టర్బిడిటీని తగ్గించేందుకు క్లారిప్లొక్యులేటర్ విధానాన్ని వాడతారు. ఫిల్టర్ బెడ్లను వినియోగించి నీటిలో బ్యాక్టీరియా, తెలియాడే చిన్నచిన్న కణాలను తొలగిస్తారు.
అప్పటి ప్రభుత్వాలు ప్రజలకు మంచినీటిని అందించాలన్న సోయి కూడా లేదు. మహిళలు బిందెలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసేవాళ్లు. వారం రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చిన పరిస్థితి. అవి కూడా వ్యర్థాలతో కలుషితమైనవే పంపిణీ చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటిని అందించే దుస్థితి కనిపించేంది. కలుషితమైన నీటిని సేవించిన ప్రజలు రోగాల బారిన పడేవారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా కలరా, డయేరియా, టైఫాయిడ్‌తో బెడ్ల నిండా రోగులే కనిపించేది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు 100 నుంచి 150 మంది వరకు కలరాతో ఇబ్బంది పడేవాళ్లు. వాంతులు, విరేచనాలు, జర్వం, రక్త విరేచనాలు, వికారం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో ఆడ్మిట్ అయ్యేవారు. కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ బారిన పడి ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు ఉండేవి. ఎంతో మంది యువకులు ఫ్లోరోసిస్ బారిన పడి అంగవైకల్యానికి గురయ్యేవారు.
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో గ్రామగ్రామాలు తిరిగిన అప్పటి ఉద్యమ నాయకులు, ప్రస్తుత సీఎం కేసీఆర్ తాగునీటి సమస్యను గుర్తించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2016లో ఆగస్టు 7న మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. మారుముల గ్రామాల్లో సైతం ప్రభుత్వం ఉచితంగా శుద్ధి చేసిన జలాలను అందించడంతో పూర్తిగా ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కలరా, అతిసారం, హెపటైటిస్, డిసెంట్రీ వంటి వ్యాధులు దాదాపుగా దూరమయ్యాయి. పీహెచ్‌సీలకు కలరా, అతిసారంతోపాటు వివిధ నీటి కాలుష్యంతో వచ్చే వ్యాధిగ్రస్తులు రావడం లేదు. ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు కనిపించడం లేదు. ఎముకల నొప్పులు, జాయింట్ పెయిన్స్ లక్షణాలు కనిపిస్తలేవు.
కాళేశ్వరం జలాశయంలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట-కొండపాక మండలాల శివారులో నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయం నుంచి గోదావరి జలాలను శుద్ధి చేసి మిషన్ భగీరథ పథకం ద్వారా త్వరలో జిల్లా తాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందుకోసం కొండపాక మండలం తిప్పారం వద్ద మల్లన్నసాగర్ జలాశయంలో మిషన్ భగీరథ కోసం ఇంటేక్వెల్ నిర్మించారు. అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలో మంగోల్ గ్రామం వద్ద 540 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల నీటి శుద్ధి ప్లాంట్‌ను నిర్మించారు. మరో ఏడాదిలో మల్లన్నసాగర్ నుంచే మిషన భగీరథ తాగు జలాలు జిల్లాకు అందనున్నాయి.
గతంలో రోజుకు వందల మంది కలరా, డయేరియా, డిసెంట్రీ, హెపటైటిస్, టైఫాయిడ్, ఫ్లోరోసిస్ సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే పరిస్థితి ఉండేది. మారుమూల గ్రామాల్లో స్వచ్ఛమైన నీళ్లు దొరకక చెరువుల్లోని కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడేవారు. నిత్యం వాంతులు, విరేచనాలు, ఎముకల, కీళ్ల నొప్పుల వంటి సమస్యలు ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం మిషన్ భగీరథ జలాల సరఫరాతో అలాంటి రోగులు కనిపించడం లేదు. ప్రస్తుతం డెంగీ, వైరల్ ఫివర్ మాత్రమే కనిపిస్తున్నాయి. నదిలో ప్రవహించే నీటిని తాగితే దాదాపుగా రోగాలు రావు.
-డాక్టర్ విలియం కేరి, మండల వైద్యాధికారి, ఆత్మకూరు(ఎం)
అప్పట్లో మంచినీళ్లు దొరకక బావులు, చెరువులు, కుంటల్లోని నీళ్లు తాగేది. రెండు రోజులకోసారి జ్వరం, వాంతులు, విరేచనాలతో ఇబ్బండి పడేవాళ్లం. అప్పట్లో రోజుకు దవాఖానకు వెళ్లేది. కానీ, కేసీఆర్ సర్కారు ఇస్తున్న మంచినీళ్లతో ఇప్పుడు ఎలాంటి జర్వాలు, కీళ్ల నొప్పులు రావడం లేదు. మంచినీళ్ల కోసం కిలోమీటర్ల మేర బిందెలు చేత పట్టుకుని నడుచుకుంటూ పోయేది. ఇప్పుడు ఇంటికే పైప్‌లైన్ ద్వారా మంచినీళ్లు వస్తున్నాయి.
-కందడి యాదమ్మ, సిలోన్బావి, ఆత్మకూరు(ఎం)
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన శుద్ధజలాలు అందించాలన్న లక్ష్యంతో గ్రామానికి ఆమడదూరంలో ఉన్న గూడేలకు సైతం మిషన్‌భగీరథ జలాలు అందుతున్నాయి. ఆత్మకూరు(ఎం) మండలంలోని 5 ఇండ్లు ఉన్న కూరెళ్ల గ్రామానికి పక్కనే ఎండ్లోనిబావి, ఆత్మకూరు(ఎం) గ్రామ పంచాయతీ పరిధిలోని 10 ఇండ్లు కలిగిన సిలోనుబావి, చాడ గ్రామ పరిధిలోని బెజ్జంకిబావి ఇలా జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలను ఆవాస ప్రాంతాలుగా గుర్తించి భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు రోగాలబారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్నాయి.
సుమారు 200 కిలోమీటర్ల ప్రవహించి మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలోని ఘన్పూర్ జీఎల్‌వీ ట్యాంకుకు చేర్చి, అక్కడి నుంచి మెయిన్ పైప్‌లైన్ ద్వారా రామలింగంపల్లి కొండమడుగు, బీబీనగర్, మాదాపూర్ గ్రామాల్లోని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నింపుతూ తుర్కపల్లిలోని కోటి లీటర్ల సామర్థ్యం కలిగిన జీఎల్‌వీ ట్యాంకులోకి పంపింగ్ అవుతున్నాయి. వీటి ద్వారా ఆలేరు, ఆత్మకూరు(ఎం), బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, మోటకొండూరు, గుండాల, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని 549 ఆవాసాలకు భగీరథ జలాలు అందిస్తున్నారు.
చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని 144 ఆవాస ప్రాంతాలకు ఏకేబీఆర్ నుంచి కృష్ణా జలాలను సరఫరా చేస్తున్నారు. రామన్నపేట, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని 76 ఆవాసాలకు పానగల్ రిజర్వాయర్ నుంచి శుద్ధి జలాలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా ప్రతి ఒక్కరికీ 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు అందిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 17 మండలాల్లోని 769 గ్రామీణ ఆవాసాలు, 6 మున్సిపాలిటీల్లోని ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం 1,84,546 ఇండ్లకు నల్లా కనెక్షన్లు, 1,375 మిషన్ భగీరథ ట్యాంకులు, 2,680 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ. 884 కోట్లు ఖర్చు చేసింది.