తుంగతుర్తి, అక్టోబర్ 23 : నాలుగు సంవత్సరాల క్రితం తల్లి, నేడు తండ్రి మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషాదకర సంఘటన తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వెంపటి గ్రామానికి చెందిన బొజ్జ మహేశ్ (30), లావణ్య (24) దంపతులు, వీరికి ఇద్దరు పిల్లలు వరుణ్ (14), వర్షిత (6) ఉన్నారు. స్థానికంగా ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాఫీగా జీవనం కొనసాగుతున్న తరుణంలో లావణ్య అనారోగ్యానికి గురైంది. నాలుగు సంవత్సరాల క్రితం ఆమె మృతి చెందింది. మహేశ్ కూడా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం చనిపోయాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. దాతలు, ప్రభుత్వం, చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.