“చిరు ఉద్యోగులుగా గ్రామ పంచాయతీల్లో పనిచేసే వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని కలలో కూడా అనుకోలేదు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన పనితో కొద్ది పాటి జీతం తీసుకుంటున్న మాకు నెలకు వేల రూపాయలు రాబోతున్నాయంటే చాలా సంతోషంగా ఉన్నది. మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్ సార్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తది అన్నవాళ్లకు ఇదొక సమాధానం. నేడు ఎక్కడ చూసినా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నయి. నాటికి, నేటికీ గ్రామాలు, పట్టణాలు ఎలా మారాయో ప్రతి ఒక్కరికీ తెలుసు.”
– గొబ్బి నర్సయ్య, వీఆర్ఏల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు
నమస్తే : వీఆర్ఏగా ఎక్కడ పనిచేస్తున్నావు.. ఎప్పటి నుంచి చేస్తున్నావు?
లతీఫ్ : నల్లగొండ మండలంలోని ముషంపల్లి గ్రామ వీఆర్ఏగా పని చేస్తున్నా. మా నాన్న సైదులు 30 ఏండ్లు మస్కూరుగా పని చేసి చనిపోయిన తర్వాత నాకు ఈ ఉద్యోగం వచ్చింది. 2008లో నేను వీఆర్ఏగా చేరిన.
నమస్తే : మొదట్లో నీకు జీతం ఎంత వచ్చింది.. ఇప్పుడు ఎంత వస్తుంది?
లతీఫ్ : నేను 2008లో చేరినప్పుడు నాకు నెలకు రూ.635 వచ్చేది. ఆ తర్వాత ఎన్నో రకాలుగా అప్పటి పాలకులపై అలుపెరగని పోరాటం చేస్తే.. 2014లో ఆరు వేలకు చేరింది. దాన్ని రూ.11వేలకు పెంచిన సీఎం కేసీఆర్.. ఇక నుంచి రూ.22వేలు ఇస్తామని ప్రకటించటం సంతోషంగా ఉన్నది.
నమస్తే : అప్పట్లో గ్రామాల్లో ఏం పని చేసేవారు?
లతీఫ్ : ఈ మధ్య కాలంలో రెవెన్యూ రికార్డుల పని మాత్రమే చేస్తున్నాం. అప్పుడైతే ఊర్లో ఉన్న ప్రతి అధికారిక పని మాకే చెప్పేవారు. అన్ని డిపార్టుమెంట్ వాళ్లు వచ్చి మమ్మల్నే సంప్రదించేవారు. కానీ.. జీతం విషయంలో మాత్రం పట్టించుకోలేదు. మమ్మల్ని ఏనాడూ గుర్తించలేదు.
నమస్తే : జీతం పెంపు కోసం ఏమైనా పోరాటం చేశారా.. అప్పటి పాలకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?
లతీఫ్ : మా నాన్న సైదులు 30 ఏండ్ల పాటు జీతం పెరుగాలని అప్పట్లో సీఐటీయూ వాళ్లతో కలిసి ఎంతో పోరాటం చేశాడు. అయినా ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. నేను 2008లో చేరిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చే దాకా పోరాటం చేసి అలసిపోయాను. 1999లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక అసలు వీఆర్ఏ వ్యవస్థే వద్దని, వాళ్లతో ఏం ఉపయోగమని మా వ్యవస్థను నిర్వీర్యం చేసి ఎంతో బాధ పెట్టాడు. ఆ తర్వాత వైఎస్ సీఎం అయ్యాక 2009లో జీతాలు పెంచాలని 46 రోజులు సమ్మె చేపట్టి 12 రోజులు హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే వంద రూపాయలు పెంచి ఇంతే అన్నాడు.
నమస్తే : రాష్ట్ర ప్రభుత్వం మిమ్ములను రెగ్యులర్ చేసింది కదా.. ఇది ముందుగానే ఊహించారా? రెగ్యులర్ చేయాలని మీరు డిమాండ్ చేశారా?
లతీఫ్ : మొదట్లో మాకు జీతం పెరిగితే చాలనుకునే వాళ్లం. చంద్రబాబు, వైఎస్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇక జీతాలు పెరుగవని భావించి వేరే పని చేసుకోవాలనుకున్నాం. కానీ.. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మంచి జీతాలు ఇస్తారని అనడంతో సకల జనుల సమ్మెలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ తర్వాత 2014లో మా జీతం రూ.11,750కి పెంచిన సీఎం కేసీఆర్ మమ్ములను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తామని 2017లో చెప్పడంతో మాకు నమ్మకం కలిగింది. అది ఇవ్వాల నిజమైంది.
నమస్తే : స్వరాష్ట్రంలో వీఆర్ఏలకు న్యాయం జరిగిందనుకుంటున్నారా?
లతీఫ్ : మా నాన్న, మేము దశాద్దాలుగా చేసిన పోరాటాన్ని ఏ పాలకులూ పట్టించుకోలేదు. కింది స్థాయి ఉద్యోగుల్లో అత్యంత దిగువన ఉన్న మమ్మల్ని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిన సీఎం కేసీఆర్ సార్ను మర్చిపోలేం. మేము ఇన్నాళ్లు అరకొర జీతాలతో అభద్రతా భావంతో ఉద్యోగాలు చేశాం. ఇక మాకు పే స్కేల్ వర్తిస్తున్నందున మేము తలెత్తుకొని తిరుగుతాం. మా మొదటి జీతంతో సీఎం కేసీఆర్ ఫొటోను పెద్దగా ఫ్రేం కట్టించి ఇంట్లో పెట్టుకొని దేవుడిలా పూజించుకుంటాం. ముఖ్యమంత్రిని గుండెల్లో పెట్టుకుంటాం.
నమస్తే : జిల్లాలో ఎంత మంది వీఆర్ఏలు ఉన్నారు.. వారందరికీ రెగ్యులర్ అయిందా? చనిపోయన వాళ్ల పరిస్థితి ఏంటి?
లతీఫ్ : జిల్లాలో మొత్తం 791 మంది వీఆర్ఏలు ఉన్నారు. అందులో పదిలోపు చదివిన వాళ్లను ఆఫీస్ సబార్టినేట్లుగా, ఇంటర్ చదివిన వాళ్లను రికార్డు అసిస్టెంట్లుగా, డిగ్రీ, ఆ పై చదివిన వాళ్లను జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సబార్డినేటర్లకు రూ.19వేల నుంచి రూ.58,850, రికార్డు అసిస్టెంట్లకు రూ.22,240 నుంచి రూ.67,300, జూనియర్ అసిస్టెంట్లకు రూ.24,280 నుంచి రూ.72,850 వరకు వేతనాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు ఇప్పటికే చనిపోయిన వాళ్ల స్థానంలో వారి పిల్లలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇస్తున్నందున, అందులో 126 మందికి న్యాయం జరుగుతుంది.
మా జీవితాల్లో వెలుగులు నింపిండు
ఎన్నో ఏండ్లుగా రెవెన్యూ శాఖలో సేవలందిస్తున్న మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు. మేము చేస్తున్న కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపిండు. గతంలో ఏ ప్రభుత్వాలూ మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. మా కష్టాన్ని తెలుసుకొని మా బాధలు తీర్చిన కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– చేపూరి మల్లమ్మ, వీఆర్ఏ, చిన్నఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లి మండలం
ఏండ్ల నాటి కల నెరవేరింది
కొన్నేండ్లుగా వీఆర్ఏల ఉద్యోగ భద్రత కలగానే మిగిలిపోతుందనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నమ్మకం వచ్చింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగానే ఏండ్ల నాటి మా కల నెరవేర్చిండు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నాడు. తరతరాలుగా ఎదుర్కొన్న సామాజిక వివక్ష నుంచి విముక్తి లభించింది. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించి రాష్ట్రంలో 20వేల కుటుంబాల్లో వెలుగులు నింపి మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ఇటీవలే పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించారు. ఇప్పుడు మమ్మల్ని గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్. ఇచ్చిన మాట తప్పకుండా చేసి చూపించడంలో సీఎం కేసీఆర్ను మించినవారు లేరు.
– గన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్, వీఆర్ఏల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు (కొండమల్లేపల్లి)
మా కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్
మా కష్టాలను గుర్తించి చదువుకు తగ్గట్టుగా అర్హతను కల్పిస్తూ పే స్కేల్ ఇస్తూ వివిధ శాఖల్లో సర్దుబాటు చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. వీఆర్ఏల సమస్యలను గతంలో ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి నీటి పారుదల శాఖతోపాటు వివిధ శాఖల్లో అర్హతను బట్టి సర్దుబాటు చేస్తున్నారు. మేము ఆశించిన స్థాయిలో వేతనాలను పెంచినందుకు సంతోషంగా ఉన్నది.
– దుర్గాప్రసాద్, వీఆర్ఏ, తిరుమలగిరి (సాగర్)
చిరు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పెద్ద కానుక
మా తాతల నుంచి గ్రామ పరిపాలనకు సహాయకులుగా పనిచేశారు. మా మాన్న కూడా ఇదే పని చేశాడు. 14 సంవత్సరాల క్రితం మా నాన్న మరణిస్తే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. నేను అప్పటికే డిగ్రీ పూర్తి చేశాను. వీఆర్ఏగా క్రమబద్ధీకరణ చేస్తారంటే వచ్చా. కానీ.. భద్రత కల్పించకపోవడంతో బాధపడ్డా. మేము ప్రభుత్వ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసేది. ఆ సమయంలో శ్రమకు తగ్గ ఫలితం లేదని బాధపడ్డాం. రెవెన్యూ వ్యవస్థలో మేము పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడం సంతోషకరం. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వేలాది కుటుంబాలకు భద్రత కలిగింది. ముఖ్యమంత్రి ముందు చూపుతో మా చిరు ఉద్యోగులకు పెద్ద కానుక ఇచ్చారు.
– కొమ్ము నర్సింహ, వీఆర్ఏల సంఘం డివిజన్ అధ్యక్షుడు, చిన్నకొండూరు, చౌటుప్పల్ మండలం