నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 24 : చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ మున్సిపల్ మాజీ హ్యాట్రిక్ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన జరగనున్న చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరు హాజరు కావాలన్నారు. భూమికోసం, భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాయిధ పోరాటంలో నిర్విరామ కృషి చేసిన ఐలమ్మ ఆశయాలను సాధించాలన్నారు. నిజాం నవాబులు, జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ తన కుటుంబాన్ని సైతం పోరుబాటలో నడిపిన ఘనత ఉందన్నారు. ఉత్సవాల సమితి రాష్ట్ర వైస్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.