యాదాద్రి భువనగిరి, (నమస్తే తెలంగాణ) / భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 28 : జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయానికి తెరలేపాయి. బయటకు రోజంతా ఒకదానిపై మరికొకటి దుమ్మెత్తి పోసుకునే ఆ రెండు పార్టీలు పదవుల దగ్గరికి వచ్చేసరికి ములాఖత్ అయ్యాయి. భువనగిరి మున్సిపాలిటీలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుని పదవులను పంచుకున్నాయి. ఎలాగైనా బీఆర్ఎస్ను దెబ్బతీయాలని కుట్రలకు పాల్పడ్డాయి. భువనగిరి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్, వైస్ చైర్మన్ బీజేపీ సభ్యులు చేజిక్కించుకున్నారు. గత నెలలో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టి పడగొట్టిన విషయం తెలిసిందే.
బుధవారం భువనగిరి మున్సిపల్ ఆఫీసులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.జయశ్రీ సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ కోసం ఎన్నిక నిర్వహించారు. మొత్తం 35 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్అఫీషియో మెంబర్‌తో కలిపి 36 మంది కాగా, కౌన్సిల్ హాల్‌కు 30మంది సభ్యులు హాజరయ్యారు. చైర్మన్‌కు కాంగ్రెస్ నుంచి 29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పోటీలో నిలువగా 18 మంది అనుకూలంగా చేతులెత్తారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ముగ్గరు బీజేపీ కౌన్సిలర్లు చేతులెత్తడం గమనార్హం. చైర్మన్‌కు బీజేపీ సహకరించడంతో వైస్ చైర్మన్‌కు కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. వైస్ చైర్మన్‌కు బీజేపీకి చెందిన 25వ వార్డు కౌన్సిలర్ మాయ దశరథ ఒక్కరే పోటీలో ఉండడగా ఆయననే వైస్ చైర్మన్‌గా ప్రకటించారు.
భువనగిరి మున్సిపాలిటీలో 35 మంది వార్డు కౌన్సిలర్లు, ఒకరు ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిపి మొత్తం 36 మంది ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 9, బీజేపీ కౌన్సిలర్లు ఆరుగురు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్‌గా ఉన్న ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మొత్తం 31 మంది అవిశ్వాసం పెట్టాలని కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. గత నెలలో పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖాళీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశం మేరకు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నికకు 29 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.
మున్సిపల్ చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించగా బీజేపీ నుంచి 9వ వార్డు కౌన్సిలర్ నల్లమాస సుమ 22వ వార్డు కౌన్సిలర్ బొర్ర రాకేష్ పేరును చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా, 21వ వార్డు కౌన్సిలర్ ఉదయగిరి విజయ్‌కుమార్ బలపరిచాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి 11వ వార్డు కౌన్సిలర్ జిట్ట వేణుగోపాల్‌రెడ్డి 29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లును చైర్మన్‌గా ప్రతిపాదించగా, 28వ వార్డు కౌన్సిలర్ కైరంకొండ వెంకటేశ్వర్లు బలపరిచాడు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఇద్దరు పోటీలో ఉండడంతో చేతులెత్తి ఓటు వేసే ప్రక్రియను నిర్వహించారు.
అలా బొర్ర రాకేష్‌కు ఐదుగురు బీజేపీ కౌన్సిలర్లు చేతులెత్తగా, పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు కాంగ్రెస్ నుంచి 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఎమ్మెల్యే కుంభంతో కలిపి 18 మంది ఓటు వేశారు. దాంతో పోతంశెట్టి వెంటేశ్వర్లు మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా బీజేపీ పార్టీ 25వ వార్డు కౌన్సిలర్ మాయ దశరథను 24 వ వార్డు కౌన్సిలర్ రత్నపురం బలరామ్ ప్రతిపాదించగా, 13వ వార్డు కౌన్సిలర్ జనగాం కవిత బలపరిచారు. వైస్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 17 మంది ఉన్నా వైస్ చైర్మన్ పదవికి పోటీలో లేకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ లోపాయికారీతనం బట్టబయలైంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటికి వెళ్లిపోవడంతో దశరథ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై ఆశాభావంతో ఉన్న కౌన్సిలర్లు ఈ ఎన్నికపై అసంతృప్తిగా ఉన్నారు. 20వ వార్డు కౌన్సిలర్ పచ్చల హేమలతాజగన్ మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ కొండల్రావుకు తమ రాజీనామా పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం జరిగిన నాటి నుంచి ఎన్నిక జరిగే రోజు వరకు తమ పేరును మున్సిపల్ చైర్మన్‌గా ప్రతిపాదించారని, తీరా ఎన్నిక నిర్వహించే సమయంలో మరొక కౌన్సిలర్ పేరు రావడంతో నివ్వెరపోయినట్టు చెప్పారు.
ఎమ్మెల్యే మాటకు కట్టుబడి చేతులెత్తినట్టు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే ఆదేశాల మేరకే ఇలా జరిగిందని, వారిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరికొందరు కౌన్సిలర్లు పదవికి, పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీజేపీ సహకరించిందని, అందుకు ప్రతిఫలంగానే కమలం పార్టీకి వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.