నందికొండ, జూలై 3 : నల్లగొండ జిల్లా నందికొండ హిల్‌కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బుద్ధవనంలో నిర్వహించిన ఆషాడ పూర్ణిమ ధర్మచక్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యతో కలసి బుద్ధవనంలోని బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి బుద్ధవనంలో మహాస్థూప మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బుద్ధుడి అష్టాంగ మార్గాలను ఆచరిస్తే చక్కటి జీవితాన్ని గడపవచ్చని, ప్రపంచ శాంతికి బుద్ధుడి బోధనలు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బుద్ధుడు చూపిన మార్గాలను అనుసరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కృషితో బుద్ధవనానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని, రానున్న రోజుల్లో బౌద్ధ పర్యాటకులకు బుద్ధవనం ప్రధాన బౌద్ధ కేంద్రంగా మారుతూ అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు.
పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా మాట్లాడుతూ బుద్ధవనంలో ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించేలా సౌకర్యాలు కల్పించి దేశంలోనే ఆగ్రగామి పర్యాకట కేంద్రంగా తీర్చిదిద్దుతామని, బౌద్ధ సంస్కృతికి నిలయంగా బుద్ధవనాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. డాక్టర్ ఎం. జోషి అష్టాంగ మార్గం, ఆర్య సత్యాలు అనే అంశాలపై, ఆచార్య ఉపేందర్‌రావు తెలుగు, పాలీ భాషకు ఉన్న సంబంధంపై ప్రసంగించారు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ బౌద్ధాన్ని ఒక మతంగా కాకుండా జీవన విధానంగా స్వీకరించాలన్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ బుద్ధవనంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ నెలకొల్పటానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బోధి సత్వ టీవీ చానల్ వ్యవస్థాపకుడు, బౌద్ధ స్థలాల అన్వేషకుడు పూనేకు చెందిన సాగర్ భగవాన్ను సన్మానించి జ్ఞాపిక అందించారు. ఆచార్య ఉపేందర్‌రావు రచించిన వజిరసార గ్రంథాన్ని ఆవిష్కరించారు. బుద్ధవనం కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ సుధాన్‌రెడ్డి, సహాయ శిల్పి శ్యాంసుందర్, ఎంజీయూ విద్యార్ధులు, బౌద్ధ అభిమానులు పాల్గొన్నారు.
బుద్ధవనంలో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలి
బుద్ధవనంలో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బీఆర్ఎస్వీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి కోరారు. స్పందించిన గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పీజీ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గెల్లును బీఆర్ఎస్ నాయుకులు సన్మానించారు.