నల్లగొండ, జూన్ 10 : వికేంద్రీకరణతో ప్రజలకు చేరువైందని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకమని, అది గుర్తించిన సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఫిట్మెంట్ రూపంలో మంచి కానుక ఇచ్చారని అన్నారు. ఉద్యోగులకు పనిభారం ఉండొద్దనే ఆలోచనతో పలు శాఖలను విస్తరించి స్టాఫ్‌ను పెంచినట్లు చెప్పారు.
నల్లగొండ అతి పెద్ద జిల్లా కావడంతో మారుమూల ప్రాంతాల వారు ఇక్కడికి రావడానికి ఎంతో ఇబ్బంది పడేవారని, మూడు జిల్లాలుగా విభజించడంతో ప్రజలు వ్యయప్రయాసల నుంచి బయటపడ్డారని ధరణి వచ్చాక రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని, ప్రతిపక్షాలు మాత్రం ధరణిపై రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ జిల్లాల విభజన, శాఖల వికేంద్రీకరణతోనే నేడు ప్రజలందరికీ పాలన చేరువై అధికారుల పర్యవేక్షణ పెరిగిందన్నారు. ఉద్యోగులు మన ప్రభుత్వం అనుకొని చిత్తశుద్ధితో పని చేయడంతోనే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. దేశంలో ఉద్యోగులను గౌరవించేది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే దశ మారుతుందని నాడు సీఎం కేసీఆర్ చెప్పినట్లు నేడు చేసి చూపిస్తున్నారని అన్నారు.
తెలంగాణ ఉద్యమం 90 శాతం ఉద్యోగుల వల్లనే బలంగా మారి రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సైతం ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా జీతాలు పెంచి ఇస్తున్నందున రాష్ట్ర అభివృద్ధిలో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరారు. తెలంగాణను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని, అందుకు అందరి మద్దతు ఉండాలని అన్నారు. జిల్లాలో ఒకరిద్దరు సమాచార హక్కు చట్టం పేరుతో అధికారులు, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని, దాన్ని సుమోటోగా తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ, కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ సమాచారం అందరికీ తెలిసి ఉండాలనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం తెచ్చారని, దాన్ని దుర్వినియోగం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్ కుష్బూగుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్‌యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్ పాల్గొన్నారు.