యాదాద్రి భువనగిరి, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ దవాఖానల్లో కాన్పుకొస్తే కోసుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. అడ్డగోలు దోపిడీతో ఆపరేషన్లు చేస్తున్నారు. మాఫియాగా మారి డబ్బులకు కక్కుర్తిపడి సిజేరియన్లకే మొగ్గుచూపుతున్నారు. అవసరం లేకున్నా రోగులను భయపెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రైవేట్‌లో 80శాతానికి పైగా ఆపరేషన్లతోనే దందా చేస్తున్నారు. ఫలితంగా తల్ల్లి ఆరోగ్యంపై ప్రభా వం చూపడంతోపాటు సామాన్య ప్రజల జేబు లు గుల్ల చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 225 వరకు ప్రైవే ట్ దవాఖానలు ఉన్నాయి. దాదాపు అన్నింటిలోనూ సిజేరియన్లే చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి సాధారణ ప్రసవాలు చేస్తూ, మిగతా రోజుల్లో సీజేరియన్లు చేస్తున్నారు. మంచి ముహూర్తాల కోసం ఎవరో ఒకరు మాత్రమే సిజేరియన్ చేయించుకుంటుండగా, మిగతా అందరికీ పైసల కోసం అడ్డగోలుగా కోసేస్తున్నారు. ప్రతి పది ప్రసవాల్లో ఎనిమిది మందికి పైగా సిజేరియన్ చేస్తున్నారు. మూడేండ్లలో 12,776 డెలివరీలు కాగా, 11098 సీ-సెక్షన్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.జిల్లాలోని ప్రైవేట్ దవఖానల్లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3862 ప్రసవాలు జర గ్గా, అందులో 3223 సీ-సెక్షన్, 639 మాత్రమే సాధారణ ప్రసవాలు చేశారు. 2024-25లో మొత్తం 4040 డెలివరీలు జరగ్గా, 3515 సిజేరియన్లు, 525 సాధారణం, 2025-26(జూన్ వరకు) 4874 ప్రసవాల్లో 4360 సీ-సెక్షన్, కేవ లం 514 సాధారణ డెలివరీలు చేశారు. సాధారణ ప్రసవాలే చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేస్తున్నా..దవాఖాన నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడం లేదు.
జిల్లాలో 21 పీహెచ్‌సీలు, మూడు సీహెచ్‌సీలు, ఒక జీజీహెచ్ ఉంది. ఇక ప్రభుత్వ దవాఖానలోనూ సీ-సెక్షన్ ప్రసవాలు పెరుగుతున్నాయి. 2023-24లో 3368 ప్రసవాలు చేయగా, 1830 సాధారణ, 1538 సీ-సెక్షన్ చేశారు. 2024-25లో 2469 డెలివరీలు కాగా 1379 సాధారణ, 1090 సీ-సెక్షన్ చేశారు. 2025-26 (జూన్ వరకు) 3168 కాగా 1445 సాధారణ, 1723 సిజేరియన్లు చేశారు. ఏడాది కాలం గా ప్రభుత్వం దవాఖానల్లోనూ సీ-సెక్షన్ కేసు లు పెరుగుతున్నాయి. సాధారణ ప్రసవాలే జరగాలని బీఆర్ఎస్ సర్కారు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సైతం ఎప్పటికప్పుడు చర్యలకు ఉపక్రమించారు. ప్రజలకు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశారు. దవాఖానల్లో అన్ని వసతులు కల్పించారు. వైద్యులను 24 గంటలు అందుబాటులో ఉంచారు. నిరంతరం రోగులను పర్యవేక్షించారు. సాధారణ ప్రసవాల బెంచ్‌మార్క్ దాటిన డాక్టర్లు, స్టాఫ్‌కు ప్రోత్సాహకాలు ప్రకటించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సర్కారు దవాఖానల్లో సీ-సెక్షన్ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
కొన్నేండ్ల క్రితం అధికశాతం సాధారణ ప్రసవా లు మాత్రమే జరిగేవి. కానీ, రానురానూ పరిస్థితి మారుతూ వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ దవాఖానల సంఖ్య పెరిగిపోయాయి. డబ్బుల అత్యాశ ఆలోచనతో ప్రైవేట్ దవాఖాన నిర్వాహకులు వికృత బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. డెలివరీ సమయంలో దవాఖానకు వస్తే రోగులకు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. బ్లడ్ తక్కువగా ఉందని, ఉమ్మ నీరు లేదని, పాప సరిగా లేదని, అడ్డంగా తిరిగిందని, సిరియస్ గా ఉందని చెప్పి భయపెడుతున్నారు. సాధారణ ప్రసవానికి అవకాశం లేదని, అలా చేస్తే తల్లీబిడ్డకు ఇద్దరి ప్రాణానికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. సిజేరియన్ అయితే ప్రమాదం తప్పి బయట పడొచ్చని సలహాలు ఇస్తున్నారు. దీం తో కుటుంబ సభ్యులు సైతం ఆపరేషన్లకు ఓకే చెబుతున్నారు.
ప్రైవేట్ దవాఖానల్లో సిజేరియన్లు చేస్తుండటంతో తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సిజేరియన్ అంటే తప్పకుండా కడుపు కోయక తప్పదు. ఆరోగ్యం సాధారణ స్థితికి రావడానికి కనీసం నెల నుంచి రెండు నెలల సమయం పడుతుంది. ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్లు వాడాలి. దీని ప్రభావం పుట్టిన పాపపై కూడా పడుతుంది. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తొలిసారి ఆపరేషన్ అయితే, రెండోసారి కూడా సిజేరియనే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీంతో తల్లికి మరింత ఇబ్బంది తప్పదు. అంతేకాకుండా రూ.వేలకు వేలు ముట్టజెప్పాల్సిందే. సాధారణ ప్రసవాలతో పోలిస్తే సిజేరియన్లకు రెట్టింపు వసూలు చేస్తారు. సాధారణ ప్రసవానికి రూ. 20 నుంచి 30 వేల మధ్య ఉంటే, సిజేరియన్‌కు రూ.50 నుంచి 70 వేల వరకు దండుకుంటున్నారు.