రేషన్‌కార్డు లబ్ధిదారులకు మూడు నెలల కోటా ఒకేసారి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రతినెలా 20వ తేదీ నుంచి పది రోజుల పాటు స్టేజ్-1 నుంచి స్టేజ్-2 ద్వారా డీలర్లకు బియ్యం అందుతుండగా ఈసారి 30 తేదీ వచ్చినప్పటికీ బియ్యం సరఫరా కాలేదు. దీనికి కారణం స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్ హమాలీల సమ్మె అని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా జిల్లా గోదాంలల్లో మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం లేవు. ఇస్తున్న బియ్యంలో ప్రతి 50కిలోల బస్తాకూ రెండు నుంచి మూడు కిలోలు తక్కువ వస్తున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట, మే 30 (నమస్తే తెలంగాణ) : తెల్ల రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం రెండు నెలలుగా బియ్యం పంపిణీకి అపసోపాలు పడుతున్నది. నెలాఖరు వరకు బియ్యం ఇవ్వడం… చాలా చోట్ల నోస్టాక్ బోర్డులు తగిలించిన ఉదంతాలు కోకొల్లలు. సన్నబియ్యం ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తీసుకుంటారనే ఆలోచనతో ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం వల్లనే అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రేషన్ షాపులకు బియ్యం రవాణా ప్రారంభం కాలేదు. వాస్తవానికి ప్రతినెలా 20 నుంచి 28 తేదీ వరకు ఎస్‌డబ్ల్యూసీ స్టేజ్-1 గోదాంల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లు స్టేజ్-2కు చేరుకుని అక్కడి నుంచి రేషన్ షాపులకు బియ్యం రవాణా అవుతాయి. కానీ ఈ నెల 29 వచ్చినప్పటికీ ఇప్పటికి వరకు అసలు స్టేజ్-2 వద్దకే బియ్యం చేరుకోకపోవడం గమనార్హం. మరో రెండు రోజుల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా షాపుల వద్దకు ఎప్పుడు వస్తాయో తెలియక డీలర్లు అయోమయంగా ఉన్నారు.
జిల్లాలోని రేషన్ షాపులకు సకాలంలో బియ్యం సరఫరా కాకపోవడానికి సరిపడా సన్నబియ్యం లేకపోవడం ఒక కారణమైతే, మరో పక్క ఎస్‌డబ్ల్యూసీ హమాలీలు తమ కూలీచార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తుండడం మరో కారణం. గత కొద్ది రోజులుగా హమాలీలు తమ కూలీచార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తుండటంతో అధికారులతో పలు దఫాలుగా జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో వారు సమ్మె చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ఈ సారి మూడు నెలలకు సరిపడా ఒకే సారి బియ్యం ఇస్తామని కేంద్రం చెప్పడంతో జిల్లాలోని 3,26,057 రేషన్‌కార్డు లబ్ధిదారులకు 17,800 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కావాల్సి ఉన్నది. అయితే జిల్లాలోని గోదాంలల్లో ప్రస్తుతం 10వేల మెట్రిక్ టన్నులకు మించి సన్నబియ్యం లేవని మిగిలిన వాటి కోసం ఇతర జిల్లాల వైపు చూస్తుండడం కూడా ఆలస్యానికి కారణమని అధికారుల ద్వారా తెలిసింది. ఇప్పుడే ఇలా ఉంటే మూడు నెలల తరువాత సన్నబియ్యం స్కీం ఎలా కొనసాగిస్తారో అర్థం కాని విషయం. గత వానకాలంలో కొనుగోలు చేసిన సన్నవడ్లను సీఎంఆర్ ద్వారా బియ్యం తీసుకుని రేషన్ పంపిణీ చేస్తుండగా ఈ యాసంగిలో పండిన సన్నాలలో 20శాతం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం పట్ల సన్నబియ్యం స్కీం అమలుపై అనుమానాలు బలపడుతున్నాయి.
ప్రతి నెలా డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లో తూకం తరుగు ఉంటుందని, సన్నబియ్యం పంపిణీతో లబ్ధిదారులు తీసుకుంటుండగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు డీలర్లు వాపోతున్నారు. బియ్యం సరఫరాలో ఎవరికీ కనిపించని దోపిడీ కాగా.. ఈ అక్రమాలకు డీలర్లే బాధ్యులనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇక్కడ మోసపోయేదే డీలర్లు కావడం విశేషం. డీలర్లకు వచ్చే బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్దనే చోరీ చేస్తున్నారు. డీలర్లకు వచ్చే 50కిలోల బస్తాలో ప్రతి బస్తాకూ 2 నుంచి రెండున్నర కిలోల వరకు తరుగు వస్తున్నట్లు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలర్లకు బస్తాతో కలిపి 50.500 కిలోలు ఉండాల్సి ఉండగా 48 కిలోలు మాత్రమే ఉంటుండగా కొన్ని బస్తాల్లో అయితే 45 నుంచి 47 కూడా ఉంటున్నాయంటున్నారు.
విచిత్రమేంటంటే స్టేజ్-1 నుంచి స్టేజ్-2కు లారీల్లో వేబ్రిడ్జిపై కాంటా వేసి 100క్వింటాళ్ల బియ్యం 50కిలోల బస్తాలు వస్తే వాస్తవానికి 200ల బస్తాలు రావాల్సి ఉండగా తరుగు కారణంగా అదనంగా మరో 20 బస్తాలు కలిపి 220 వరకు స్టేజ్-2కు చేరుకుంటాయి. కానీ స్టేజ్-2 నుంచి డీలర్లకు మాత్రం శాల్తీల లెక్కన వేస్తుండడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తమ వద్ద ఉన్న పాత దొడ్డు బియ్యం తీసుకోకపోవడంతో ముక్కిపోయి పురుగు పట్టిన కారణంగా సన్నబియ్యంలోకి పురుగులు చేరి వినియోగదారులు ఆందోళనలు చేసే అవకాశం ఉందంటున్నారు.
వెంటనే వాటిని తరలించాలని కోరుతున్నారు. ఈ విషయాలపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రసాద్‌ను వివరణ కోరగా హమాలీల పంచాయితీ త్వరలోనే ముగిసిపోతుందని, బియ్యం రవాణా ప్రారంభిస్తామన్నారు. సన్నబియ్యం తక్కువ పడే అవకాశం లేదని, ఒకవేళ తక్కువ అయినా ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తామని డీలర్లకు తక్కువ తూకం వస్తే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఉండే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.