హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేటకు చెందిన నిఖిల్ అనే యువకుడి మృతికి సంబంధించిన కేసులో ఆరోపణలతోపాటు ప్రాథమిక ఆధారాలున్నపుడు నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. 2022లో ఓ యువతిని ప్రేమించి వారి బెదిరింపులను ఎదురొన్న నిఖిల్ అదృశ్యంకాగా, ఆ తరువాత మృతదేహం కాల్వలో కనిపించడంపై నమోదైన కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. 2022లో జరిగిన సంఘటనపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, 6 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
2022 అక్టోబరులో తన కుమారుడు నిఖిల్ అదృశ్యమయ్యాడని, అనంతరం గాయాలతో మృతదేహం కనిపించడంతో ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరగలేదని, సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ తండ్రి దారావత్ భాసర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ ఎన్ .తుకారాంజీ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఎస్ .నగేశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ కుమారుడిది ఆత్మహత్య కాదని, ఒక ప్రేమించిన యువతి బంధువుల బెదింపులు, దాడులే కారణమన్నారు. దర్యాప్తులో కనీస ఆధారాలైన సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా, లొకేషన్ తదితర వివరాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పోస్టుమార్టం నివేదిక అందకుండానే ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.
ఎస్టీకి చెందిన పిటిషనర్ కుమారుడు మరో యువతితో ఉన్న సంబంధం నేపథ్యంలో ఆమె బంధువులపై అనుమానాలున్నాయని చెప్పినా ఆ కోణంలో దర్యాప్తు సాగలేదన్నారు. కులం ఆధారంగా నేరం జరిగి ఉంటుందన్న కోణంలో దర్యాప్తు జరగలేదన్నారు.ఎస్సీ, ఎస్టీ కమిషన్ తోపాటు రాష్ట్ర మానవ హకుల కమిషన్ తదితర సంస్థలకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో నిష్పాక్షిక దర్యాప్తు నిమిత్తం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. పోస్టుమార్టంలో ఉరివేసినట్లు ఒకసారి, నీటిలోపడి ఊపిరి ఆడక మృతి చెందినట్లు మరోసారి నివేదికలు వచ్చాయన్నారు.
శరీరంపై గాయాలు మృతి చెందిన తరువాత ఏర్పడ్డాయన్న దానిపై సందేహాలున్నాయన్నారు. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగిందని, సీసీ టీవీ, పోస్టుమార్టం నివేదిక, కాల్ డేటా అన్నీ పరిశీలించినట్లు తెలిపారు. ఇందులో ఉన్న సాక్షులందరినీ విచారించామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించిందన్నారు. దర్యాప్తులో పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లు ఎదురోలేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి వాదనలను, రికార్డులను పరిశీలిస్తే హత్య అని భావించేందుకు పలు ప్రాథమిక ఆధారాలున్నాయని పేరొన్నారు.
కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన పంచనామా ప్రకారం ఎడమ చేయి, పకటెముకలు, తొడ, ముఖం, మెడపై గాయాలు, రక్తనాళాల వాపు మెడ నుంచి ఛాతి వరకు దెబ్బతిన్నట్లు నమోదైందన్నారు. అనుమానాస్పద మృతి, హత్య అయి ఉండవచ్చని అనిపించినపుడు మరణానికి కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ పరీక్ష అవసరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్యాప్తు శాస్త్రీయంగా, నిష్పాకితంగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వెలువడకముందే ఆత్మహత్య కోణంలో దర్యాప్తు సాగినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు.
ఇలాంటి చర్యలు నిష్పాక్షిక దర్యాప్తునకు రాజ్యాంగం కల్పించిన హామీని దెబ్బతీస్తుందన్నారు. కుటుంబానికి పోస్టుమార్టం నివేదికను అందింంచడంలో పారదర్శకత లేకపోవడం, పరస్పర విరుద్ధమైన ఫోరెన్సిక్ అభిప్రాయాలుండటంపై సందేహాలు ఉన్నాయని తెలిపారు. ఎస్టీ యువకుడి సంబంధాన్ని అమ్మాయి కుటుంబం వ్యతిరేకించిన కోణంలో లోతైన దర్యాప్తు జరగలేదన్నారు. ఒక దర్యాప్తులో నిష్పాక్షకత, సమగ్రత ప్రశ్నార్థకమైనపుడు, సహేతుకమైన అనుమానాలున్నపుడు రాజ్యాంగ కోర్టులు జోక్యం చేసుకుని వాస్తవాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. అందువల్ల ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నామన్నారు. 2022లో నమోదైన కేసుకు సంబంధించిన కాల్ డేటా, డిజిటల్ సాక్ష్యాలు, సీసీ టీవీ ఫుటేజీ తదితర ఆధారాలను తాజాగా పరిశీలించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ నివేదికలను నిపుణులతో తాజాగా అధ్యయనం చేయించి నివేదిక తీసుకోవాలన్నారు.