కోదాడ, జనవరి 07 : మైనర్లు వాహనాలు నడిపితే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని కోదాడ వాహనాల తనిఖీ అధికారి జిలాని తెలిపారు. బుధవారం కోదాడ తేజ టాలెంట్ పాఠశాలలో విద్యార్థులకు డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలనే ఆశతో ఉంటారని, వారి ఆశలను వమ్ము చేయకుండా క్రమశిక్షణగా చదువుకుని వారి కలలను నెరవేర్చాలన్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు సమాజం పట్ల గౌరవం కలిగే విధంగా హితబోధ చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా డ్రైవింగ్ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సోమా నాయక్, సెక్రటరీ సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.