Nalgonda : విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై అకారణంగా దాడి చేసి, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ తల్లా రామ్ కుమార్‌పై దాడి చేసి గాయపరిచిన తుపాకుల వెంకటేశం అనే వ్యక్తిపై కేసు రిజిష్టరైంది. అసలేం జరిగిందంటే..
నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్జాలబావి గ్రామ సమీపంలో గల ఐటీ హబ్ (IT Hub) వద్ద ఆదివారం ఉదయం సుమారు 08:10 గంటల సమయంలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు డ్రైవర్ తల్లా రామ్ కుమార్ బస్సును నిర్ణీత స్టాప్ వద్ద నిలిపారు. ఆ సమయంలో తన బైక్‌పై (TS-05-FJ-9301) వచ్చిన తుపాకుల వెంకటేశం అనే వ్యక్తి, బస్సును మధ్యలో ఎందుకు ఆపలేదు? అని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు.
బస్సును కేవలం నిర్దేశించిన స్టాపుల వద్దే ఆపుతామని డ్రైవర్ రామ్ కుమార్ చెప్పినప్పటికీ నిందితుడు వెంకటేశం డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. అనంతరం బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌ను సీటులో నుండి కిందకు లాగి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో డ్రైవర్ రామ్ కుమార్ కుడి కంటిపైన, మోకాలికి గాయాలయ్యాయి.
బాధితుడు రామ్ కుమార్ ఫిర్యాదు మేరకు నల్గొండ రూరల్ SI. సైదా బాబు నిందితుడు తుపాకుల వెంకటేశంపై బీఎన్ఎస్ (BNS) సెక్షన్లు 118(1), 352 కింద కేసు (FIR No. 90/2026) నమోదు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల విధినిర్వహణకు ఆటంకం కలిగిస్తూ వారిపై భౌతిక దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ సిబ్బందికి అండగా ఉండి వారి రక్షనే తమధ్యేయ మని నాగిరెడ్డి చెప్పారు.