కట్టంగూర్, ఆగస్టు 12 : అతివేగం, అజాగ్రత్తగా కారు నడిపి ఓ మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌కు నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జురిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని కట్టంగూర్ ఎస్ఐ రవీందర్ తెలిపారు. 2015 మార్చి18న ఖమ్మం జిల్లా వేపకుంట గ్రామానికి చెందిన అంగోతు కిశోర్ కారు నడుపుతూ హైదరాబాద్ నుండి విజయవాడకు బయల్దేరాడు. మార్గమధ్యంలోని కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివాలోని చెర్వుఅన్నారం క్రాస్ రోడ్డు వద్ద బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన సుమన్‌కు తీవ్ర గాయాలు కాగా అతడి బంధువు, వెనకాల కూర్చున్న పరిమళకు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతిచెందింది. అప్పటి ఎస్ఐ విజయప్రకాశ్ కేసు నమోదు చేసి కేసు పూర్తి సమాచారాన్ని కోర్టులో ఫైల్ చేశాడు. విచారణ అనంతరం కిశోర్ దోషిగా తేలడంతో న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.