మిర్యాలగూడలో మరో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. గడువు తీరిన వాహనాలను స్క్రాప్ కింద తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటికి ప్రమాదానికి గురైన వాహనాల నంబర్లను అమర్చి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇటీవల ఓ కారు రిపేరుకు గురికావడంతో జీపీఎస్ ఆన్ అయింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.
మిర్యాలగూడ, జూన్ 7: గడువు తీరిన వాహనాలు స్క్రాప్ కింద తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రమాదానికి గురైన వాహనాల నెంబర్లు వీటికి అమర్చి అధిక ధరలకు విక్రయిస్తున్న విషయం మిర్యాలగూడలో వెలుగు చూసింది. హైదరాబాద్‌లో చోరీకి గురైన కారును మున్సిపాలిటీలో పనిచేస్తున్న వ్యక్తి ఇటీవల ఆంధ్రాలో కొనుగోలు చేశాడు.
ఈ కారును పట్టణంలోని కారు షెడ్డులో రిపేర్ చేయిస్తుండగా కారు జీపీఎస్ ఆన్ కావడంతో రెండేండ్ల క్రితం హైదరాబాద్‌లో కారు చోరీకి గురైందని యజమాని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు జీపీఎస్‌ను ఆధారం చేసుకుని మిర్యాలగూడకు వచ్చిన సదరు యజమాని విషయాన్ని పోలీసులకు తెలిపాడు. కారు ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ మార్చి ఉన్నదని మెకానిక్ గుర్తించి చెప్పాడు. దీంతో కారు ఎక్కడ కొనుగోలు చేశారో
, ఎవరు అమ్మారో చెప్పాలని పోలీసులు సదరు వ్యక్తిని ప్రశ్నించడంతో వివరాలు చెప్పినా కూడా అసలు వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారైనట్లు తెలిసింది. చోరీకి గురైన వాహనం కూపీ లాగడంతో నెంబర్ ఎవరు, ఎలా మార్చారనే విషయాన్ని విచారణ చేసే క్రమంలో పట్టణానికి చెందిన ఒక టింకరింగ్, డెంటింగ్ షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ఈ కారు నెంబర్, చాసిస్ నెంబర్ మార్చలేదని, పట్టణంలోని ఒక పార్కింగ్ యార్డు యజమాని పంపించిన మూడు కార్లకు మాత్రం ఇంజిన్, చాసిస్ నెంబర్లు మార్చినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. చోరీకి గురైన వాహనం గురించి కూపీ లాగడంతో బీఎస్-3 వాహనాల గుట్టు బయటపడింది.
2019లో భారత ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువు తరువాత బీఎస్-3 కార్లు విక్రయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో షోరూమ్‌ల యజమానులు చాసిస్ నెంబర్లు, ఇంజిన్ నెంబర్లు తొలగించి వాటిని స్క్రాప్ కింద విక్రయించినట్లు సమాచారం. ఈ కార్లను అతి తక్కువ ధరలకు స్క్రాప్ కింద కొనుగోలు చేసి, రోడ్డు ప్రమాదాల్లో ధ్వంసమైన కార్ల ఇంజిన్, చాసిస్ నెంబర్లను అమర్చి బీఎస్-3 వాహనాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పట్టణంలోని ఓ పార్కింగ్ యార్డు యజమాని ఈ విధంగా మూడు వాహనాలకు మార్చినట్లు డెంటింగ్ షాపు యజమాని పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. సుమారు నాలుగేండ్ల క్రితం ఢిల్లీ, పాండిచ్చేరికి చెందిన సుమారు 20 వాహనాలను తెలంగాణకు తీసుకొచ్చి ఇదే రీతిలో విక్రయాలు జరిపిన ముఠా గుట్టును అప్పట్లో పోలీసులు ఛేదించారు.
ఈ అక్రమ దందాలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ప్రధానపాత్ర ఉండడంతో ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి చెందిన ఒక ముఖ్య నాయకుడి ద్వారా మిర్యాలగూడ పోలీసులకు ఫోన్ చేయించినట్లు, దీంతో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఎస్-3 వాహనాల దందాలో ప్రధాన సూత్రధారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారీలో ఉన్నాడని సమాచారం. కోట్లాది రూపాయల దందా కొనసాగిన ఈ అక్రమ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ చేయిస్తేనే అసలు దోషులు బయటపడటంతోపాటు అక్రమాలు ఏమేరకు జరిగాయనే విషయాలు వెలుగులోకి వస్తాయి.
సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ రాజశేఖర్ రాజు
బీఎస్-3 వాహనాలకు ఇంజిన్, చాసిస్ నంబర్లు మార్చి విక్రయాలు జరుపుతున్న వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాం. ఈ విషయంలో దోషులెంతటివారినైనా ఉపేక్షించేది లేదు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ విషయంలో నెంబర్లు మార్చిన వారు, వాహనాలు కొనుగోలు చేసిన వారు, వాహనాలు విక్రయించిన ప్రధాన సూత్రధారి ఎవరనేది త్వరలోనే తేల్చి, చర్యలు తీసుకుంటాం.