నీలగిరి, సెప్టెంబర్ 8: నల్లగొండ పోలీసులు చట్టాన్ని అతిక్రమించి కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ టూ టౌన్ పోలీసుల వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అక్రమ కేసుల విషయమై సోమవారం ఆయన నల్లగొండ డీఎస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు..
ఆదివారం రాత్రి గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన స్వల్ప ఘర్షణ అనంతరం ఇరు వర్గాల వారు వెళ్లిపోయారన్నారు. టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ చిరంజీవి తదితరులు నార్కట్‌పల్లికి చెందిన మట్టిపల్లి మణికంఠను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని అన్నారు. తాము కేసులు పెట్టబోమని వారు చెబుతున్నా వినకుండా మణికంఠ మరికొంతమందిని టూ టౌన్ పోలీసులు బెదిరించి, వారిచేత రాత్రి 12 గంటల సమయంలో బలవంతంగా పిటిషన్ రాయించుకున్నట్లు తెలిపారు.
నల్లగొండకు చెందిన బబ్లూ, తదితరులపై కేసు పెట్టి వారిని రాత్రి నుంచి టూ పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురి చేశారన్నారు. వీరిలో బబ్లూ అన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయనను రాత్రికి రాతే వదిలిపెట్టి బబ్లూను మాత్రం విడిచిపెట్టలేదన్నారు. తక్షణమే బబ్లూను విడిచిపెట్టి, కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు..
కాంగ్రెస్ నేతల మెప్పుకోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు వెంటనే టూటౌన్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రజల తిరుగుబాటును ఎదురోవాల్సి వస్తుందని కంచర్ల హెచ్చరించారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రీ ఉన్నారు.