సూర్యాపేట, మార్చి 21 : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజాకంటకమైందని, లోపబూయిష్టమైందని, అంకెల గారడి చేశారే తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను నిలువునా మోసం చేస్తూ రూపొందించిన బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రియల్ ఎస్టేట్, ప్యూచర్ సిటీ పేరుతో కమీషన్లు తీసుకునేందుకు ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారన్నారు. వ్యవసాయానికి, పేద బడుగు బలహీన వర్గాలతో పాటు యువత ఉపాధి కల్పనకు ఎలాంటి నిధులు కేటాయించలేదని ఏ వర్గానికి కూడా ఈ బడ్జెట్ న్యాయం చేయలేదన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలకు కూడా నిధులు లేకుండా చేసి ప్రజలను వంచించే బడ్జెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని, బడ్జెట్లో బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మూడు బడ్జెట్లకు రూ.60 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ.12 వేల కోట్లు పెట్టి చేతులు దులుపుకుందన్నారు. యువతను, విద్యార్థులను నిలువునా మోసం చేశారని రైతులకు రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని నేటి వరకు ఇవ్వలేదన్నారు. ఇలాంటి మోసపూరిత బడ్జెట్ను తమ రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, మూడేళ్లు అయిందని ఇక ఉన్నది రెండు బడ్జెట్లు కాబట్టి వచ్చినవన్ని దోచుకుందాం పంచుకుందాం అన్న రీతిలో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇక్కడ ప్రజలకే దిక్కు లేదు అంటే రాహుల్ గాధీకి వెయ్యి కోట్లు ఇస్తామంటున్నాడని ఈ బడ్జెట్ను బీఆర్ఎస్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ పేరుతో ప్రజలను మరోసారి మోసగించిందన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మరిచిందన్నారు. వ్యవసాయ రంగంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బడ్జెట్ తగ్గించారన్నారు. ఇందిరమ్మ బీమా అని పెట్టారని ఇందిరమ్మ ఇళ్లకే దిక్కులేదని, రైతులకు బోనస్, గిట్టుబాటు ధర, పెన్షనర్లకు పెన్షన్ పెంపు, మహిళలకు రూ. 2,500, విద్యార్థినీలకు స్కూటీల ఊసే లేదన్నారు. యువతను, మహిళలను, అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ తరపున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ మోసాన్నిఎండగడుతామన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఆత్మకూర్.ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహ్మరావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, నాయకుడు శ్రావణ్ పాల్గొన్నారు.