నల్లగొండ సిటీ, ఏప్రిల్ 05 : నల్లగొండ జిల్లా కనగల్ మండలం బుడమల్లపల్లి గ్రామ సెక్రటరీ కాశీం విధుల నుండి సస్పెండ్ అయ్యాడు. గ్రామ పంచాయతీ బిల్లు విషయంలో అవకతవకలతో పాటు పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. గ్రామంలో బీఆర్ఎస్ పాలనలో చేసిన పనులకు రావాల్సిన బిల్లుల విషయంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పేర్కంటూ గతంలో గ్రామ మాజీ సర్పంచ్ కారింగు పార్వతమ్మ, జానయ్య గౌడ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బిల్లుల విషయంలో కావాలనే ఇబ్బందులు పెడుతున్నాడంటూ కలెక్టర్ వద్ద వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై కలెక్టర్ జిల్లా స్థాయి అధికారుల ఎంక్వైరీ అనంతరం సెక్రటరీ కాశీంను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.