సూర్యాపేట, మార్చి 18 (నమస్తే తెలంగాణ)/నల్లగొండ : ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాలు నిషేధిస్తూ ప్రభుత్వ ఆదేశానుసారం వీసీ చర్యలు తీసుకోవడంపై విద్యార్థిలోకం భగ్గుమన్నది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వేదిక అయిన ఉస్మానియాలో ఇప్పటి వరకు కూడా నిషేధం పెట్టకపోగా, తొలిసారిగా రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు.
కాగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేశారు. ముందస్తుగానే ఆయా మండలాల్లో పోలీసులు గుర్తించి కట్టడి చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జునతోపాటు రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేశ్ యాదవ్‌ను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేవరకొండలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజుతోపాటు మరికొంత మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మిర్యాలగూడలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్, సంస్థాన్ నారాయణపురంలో
బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేశ్, చండూరులో బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పనస లింగస్వామి గౌడ్, త్రిపురారంలో బీఆర్ఎస్వీ నాయకుడు చాట్ల విజయ్, నకిరేకల్, నార్కట్‌పల్లి, పాలకవీడు, నేరేడుచర్ల, పెన్‌పహాడ్, మోత్కూరు, ఆలేరు, ఆత్మకూర్.ఎం మోటకొండూరు, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేశారు.