నల్లగొండ ప్రతినిధి, మే 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నల్లగొండకు రానున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో జరుగనున్న పార్టీ శ్రేణులు, పట్టభద్రుల సమావేశాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నేరుగా కేటీఆర్ నల్లగొండకు చేరుకుంటారు.
నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్‌లో జరిగే మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం దేవరకొండకు బయల్దేరి మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఇంటికి మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ రవీంద్రకుమార్ తండ్రి కనీలాల్నాయక్ దశదిన కర్మకు హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3గంటలకు హాలియాకు చేరుకుని నాగార్జునసాగర్ నియోజకవర్గ సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4:30 గంటలకు మిర్యాలగూడకు చేరుకుని అక్కడ సమావేశంలో పాల్గొంటారు. సాయం త్రం 6గంటలకు హుజూర్నగర్ చేరుకుని అక్కడ పట్టభద్రులు, పార్టీ నేతలు, శ్రేణులతో జరిగే మీటింగ్‌లో కేటీఆర్ పాల్గొననున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు తోడుగా మరొకరిని ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా ఎన్నికల ఇన్చార్జిలపై తాజాగా ప్రకటన చేశారు.
తాజా లిస్ట్ ప్రకారం దేవరకొండకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బలరాజు, మిర్యాలగూడకు కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, మునుగోడుకు మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, నాగార్జునసాగర్‌కు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్‌సాగర్, నకిరేకల్‌కు కార్మిక విభాగం నేత రాంబాబుయాదవ్, నల్లగొండకు మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, హుజూర్‌నగర్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే విజయుడు, కోదాడకు కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీహెచ్ రాకేశ్‌కుమార్,
సూర్యాపేటకు సీనియర్ నేత నవీన్‌కుమార్, తుంగతుర్తికి సీనియర్ నేత గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఆలేరుకు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, భువనగిరికి సీనియర్ నేత ఇబ్రహీం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిలుగా వ్యవహరించనున్నారు. వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక తాజా, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ ముందుకు నడిపించనున్నారు.